పార్లమెంటు భవన సముదాయం భద్రతా బాధ్యతలు ఇక నుంచి సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ పరిధిలోకి వెళ్ళనున్నాయి.
CISF ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన సుమారు 3,300 మంది సిబ్బంది పహారా కాయనున్నారు. మే 20 నుంచి పార్లమెంటు భద్రత సీఐఎస్ఎఫ్ పరిధిలోకి అధికారికంగా వెళ్ళనుంది. ఇప్పటివరకు CRPF, దిల్లీ పోలీస్, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్‌లు పార్లమెంటు భవన సముదాయంలో ఉమ్మడిగా భద్రతా బాధ్యతలు నిర్వహించాయి.
పార్లమెంటు కాంప్లెక్స్‌లోని అన్ని ఎంట్రీ పాయింట్లు, అగ్నిమాపక సిబ్బంది, సీసీటీవీ కంట్రోల్ రూమ్, జాగిలాల స్క్వాడ్, వాట్ టవర్ వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించారు. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని మోహరించారని, కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయి నియామకాలు జరుగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
గతేడాది డిసెంబరు 13న లోక్‌సభ సమావేశాల సందర్భంగా జీరో అవర్ జరుగుతుండగా.. ఇద్దరు దుండగులు సభలోకి దూకారు. అదే సమయంలో పార్లమెంట్ భవనం బయట ఇద్దరు వ్యక్తులు స్మోక్ బాంబులు విసిరారు. ఈ ఘటన అనంతరం పార్లమెంటు సముదాయం వద్ద భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది.