తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల, శ్రీశైలం, యాదాద్రి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దైవ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి తిరుమలేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి.
ఆక్టోపస్ బిల్డింగ్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలోనూ రద్దీ కొనసాగుతోంది. ఆదివారానికి తోడు వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. త్తారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు శ్రీమల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు.టోల్‌గేట్ మలుపు వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. శివపార్వతుల విగ్రహాల వద్ద నిలిపివేయడంతో ఆలయానికి వచ్చి తిరిగి వెళ్లేవారికి ఇబ్బందికరంగా మారింది.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో యాదాద్రిలో సందడి వాతావరణం నెలకొంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి సుమారు 3 గంటలు సమయం పడుతోంది. ప్రసాదాల కౌంటర్, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, విష్ణు పుష్కరిణి ప్రదేశాల్లో భక్తుల సందడి నెలకొంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.