కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయ్‌బరేలిని వదిలేసిన సోనియాగాంధీ ఇప్పుడు తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు.
జంషెడ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ, రాయ్‌బరేలిలో రాహుల్ గాంధీ తరఫున సోనియాగాంధీ ప్రచారం నిర్వహించడాన్ని ప్రస్తావించారు. సోనియా గాంధీ తన కొడుకును ప్రజలకు అప్పగిస్తున్నానని రాయ్ బరేలీలో చెప్పారని, కానీ అక్కడ దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరూ లేరా అని ప్రశ్నించారు.
రాయ్‌బరేలి లోక్‌సభ స్థానాన్ని గాంధీ కుటుంబం తమ కుటుంబ ఆస్తిగా భావిస్తుందని మండిపడ్డారు. కోవిడ్ విజృంభణ తర్వాత తన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని సోనియా గాంధీ ఇప్పుడు కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారని చురకలు అంటించారు. కాంగ్రెస్ యువరాజు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వయనాడ్ నుంచి రాయ్‌బరేలి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. కుటుంబ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా మెలగాలని పిలుపునిచ్చారు.