బిహార్లోని ఖగారియా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రీల్స్ సరదా విషాదం మిగిల్చింది. గంగానదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదం జరిగి నలుగురు గల్లంతయ్యారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు.
ఖగారియా జిల్లా పర్బట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అగువాని ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. బాలిక సహా ఆరుగురు రీల్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నీటిలో మునిగిన నలుగురి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అన్వేషించినా ఆచూకీ దొరకలేదు.
నీటి ప్రవాహ ఉధృతిని పసిగట్టలేకపోవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చు అని పర్బట్టా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు. మునిగిపోయినవారి ఆచూకీ కోసం స్థానిక ఈతగాళ్లతో ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గల్లంతు అయిన వారి పేర్లు… నిఖిల్ కుమార్ (23), ఆదిత్య కుమార్ (18), రాజన్ కుమార్ (16), శుభం కుమార్ (16)గా తేలింది. శ్యామ్ కుమార్ (24) అనే యువకుడితో పాటు అతడి సోదరి సాక్షి కుమారి (16) ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు.