ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు భారీ ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా దింపారు. దీంతో 179 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.
బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఇంజన్లో మంటలు గుర్తించారు. వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండింగ్ కాగానే ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.
ఈ ఘటనపై ఎయిరిండియా దర్యాప్తునకు ఆదేశించింది. ప్రమాద కారణాలను అన్వేషిస్తున్నామని ఎయిరిండియా ప్రకటించింది.శుక్రవారంనాడు ఢిల్లి నుంచి బెంగళూరు బయలుదేరిన విమానంలో ఇలాంటి సమస్యే తలెత్తింది. ఇలా వరుస ఘటనలు జరగడంపై ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.