ప్రస్తుత ఎన్నికల్లో ఎన్‌డిఎ గెలవడం, మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవడం ఖాయమని, ఆ తర్వాత ఆరునెలల్లోగా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో కలిసిపోవడం తథ్యమనీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జోస్యం చెప్పారు.
మహారాష్ట్రలోని పాల్ఘార్లో యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాము ఆక్రమించిన జమ్మూకశ్మీర్‌ను నిలబెట్టుకోడానికి పాకిస్తాన్ నానా అవస్థలూ పడుతోందన్నారు. ‘‘గత పదేళ్ళలో మనం కొత్త భారతదేశాన్ని చూసాం. సరిహద్దుల వద్ద భద్రత పెరిగింది. ఉగ్రవాదం, నక్సలిజం తగ్గుముఖం పట్టాయి. ముంబై పేలుళ్ళు జరిగినప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉగ్రవాదులు సరిహద్దులకు అవతలినుంచి వచ్చారని చెప్పేది. ఇంక మీ క్షిపణులకు ప్రయోజనమేముంది?’’ అని అడిగారు.
‘‘గత మూడేళ్ళలో పాకిస్తాన్లో చాలామంది ఉగ్రవాదులు హతమయ్యారు. వారి హత్యల వెనుక భారతీయ నిఘా సంస్థల హస్తం ఉందని ఓ పెద్ద బ్రిటిష్ పత్రిక రాసుకొచ్చింది. మేం మా శత్రువును పూజించం. మా ప్రజలను చంపేవారిని మేం పూజించం, వాళ్ళకి తగిన బుద్ధి చెబుతాం. ఇప్పుడు పీఓకేను నిలబెట్టుకోవడం పాకిస్తాన్‌కు కష్టమైపోయింది. మోదీని మూడోసారీ ప్రధానమంత్రి కానీయండి. ఆరు నెలల్లోగా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో భాగం అయిపోతుంది. అలాంటి పని చేయడానికి ధైర్యం కావాలి’’ అని యోగి అన్నారు.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాలించే రోజుల్లో పేదలు ఆకలితో చనిపోతుండేవారని, మోదీ హయాంలో 80కోట్లమంది పేదలకు ఉచిత రేషన్ ఇస్తున్నామనీ ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. ‘‘పాకిస్తాన్‌ను పొగిడేవాళ్ళకు చెబుతున్నా. ఆ దేశపు మొత్తం జనాభా కంటె ఎక్కువమందిని మన దేశంలో పేదరికం నుంచి బైటకు తీసుకొచ్చారు మోదీ. వాళ్ళు భారత్‌లో ఉండిఉంటే ఆకలిచావులు చచ్చేవారు కాదు, వారికి ఉచిత రేషన్ లభించేది’’ అని యోగి ప్రసంగించారు.
కొద్దిరోజుల క్రితం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు. మోదీ నాయకత్వంలో పీఓకే భారత్‌లో కలిసిపోతుందన్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక కశ్మీర్ భారత్‌లోనూ, ఒక కశ్మీర్ పాకిస్తాన్‌లోనూ ఉండేదని చెబుతుండేవారు. పాకిస్తాన్ కశ్మీర్‌ను ఆక్రమించిందనీ, అది నిజానికి మనదేననీ మన పార్లమెంటు ఎప్పుడూ చర్చించలేదు. ఇప్పుడు పీఓకేలో ప్రతీరోజూ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు మువ్వన్నెల జెండాను పట్టుకుని తిరుగుతున్నారు. మోదీకి 400 స్థానాలు వస్తే, పీఓకే భారత్‌లో భాగమైపోతుంది. అది ఇప్పటికే మొదలైంది’’ అని హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు.