కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసిన బీజేపీ నాయకుడు జి దేవరాజె గౌడ, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడాలని, అలా చేస్తే వందకోట్లు ఇస్తామని శివకుమార్ తనకు ఆఫర్ చేసారని చెప్పారు.
శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి పోలీసులు తీసుకువెడుతున్న సమయంలో మీడియాతో మాట్లాడిన దేవరాజె గౌడ తనకు డికె శివకుమార్ రూ.5కోట్లు అడ్వాన్స్‌గా పంపించారని వెల్లడించారు. ‘‘శివకుమార్ ప్రతిపాదనను నేను తిరస్కరించాను. దాంతో నామీద పోలీసు కేసులు పెట్టారు. నన్ను అరెస్ట్ చేసారు. నేను విడుదల అయిన తర్వాత శివకుమార్ వ్యవహారాలను బైటపెడతాను. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం’’ అని చెప్పారు.
‘‘ప్రజ్వల్ రేవణ్ణ కేసులో సెక్స్ వీడియోలున్న పెన్ డ్రైవ్‌లను కుమారస్వామే వ్యాప్తిలోకి తీసుకొచ్చారంటూ ప్రకటన చేయాలని నాకు చెప్పారు. నిజానికి ఆ పని చేసింది డికె శివకుమారే. ప్రజ్వల్ రేవణ్ణ దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన కార్తీక్ గౌడ నుంచి డికెఎస్ ఆ పెన్‌డ్రైవ్‌ను సంపాదించారు. ఆ తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయనే నడిపించారు’’ అని దేవరాజె గౌడ వివరించారు.
ప్రజ్వల్ సెక్స్ వీడియోల వ్యవహారాన్ని నడిపించడానికి మంత్రులు చెలువరాయస్వామి, కృష్ణ బైరె గౌడ, ప్రియాంక్ ఖర్గేలతో శివకుమార్ ఒక టీం ఏర్పాటు చేసారు. కుమారస్వామి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ పరువు తీసేయడానికి వారు పెద్దస్థాయిలో ప్రణాళిక రచించారు. వాళ్ళు నాకు వంద కోట్లు ఇస్తామన్నారు. నేను బసచేసిన బౌరింగ్ క్లబ్ రూం నెంబర్ 110కి రూ.5కోట్ల అడ్వాన్స్ పంపించారు. చెన్నరాయపట్నకు చెందిన స్థానిక నాయకుడు గోపాలస్వామిని నాతో డీల్ మాట్లాడడానికి పంపించారు. ఆ సెక్స్ స్కాండల్‌తో మోదీకి కూడా సంబంధం ఉందంటూ ఆయన పేరు పాడు చేసేలా మాట్లాడాలంటూ డికె శివకుమార్ నాకు వందకోట్లు ఆఫర్ చేసారు. శివకుమార్ ప్రధాన లక్ష్యం కుమారస్వామిని రాజకీయంగా ఖతం చేయడమే’’ అని దేవరాజె గౌడ ఆరోపించారు.
‘‘వారి కుట్రలో భాగం అవడానికి నేను ఒప్పుకోలేదు. దాంతో నామీద మొదట అట్రాసిటీ కేసు పెట్టారు. కానీ ఎలాంటి ఆధారాలూ వారికి లభించలేదు. దాంతో లైంగిక వేధింపుల కేసులో ఇరికించాలని చూసారు. ఆ కుట్ర కూడా విఫలమైంది. దాంతో ఇప్పుడు నామీద రేప్ కేసు పెట్టారు. నన్ను నాలుగు రోజులు విచారించారు. అయినా వారికి ఏమీ దొరకలేదు’’ అని చెప్పారు.
‘‘శివకుమార్ సంభాషణల ఆడియో రికార్డులు నా దగ్గర ఉన్నాయి. వాటిని నేను తప్పకుండా బైటపెడతాను. నేను జైలు నుంచి బైటకు వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది’’ అని దేవరాజె గౌడ చెప్పుకొచ్చారు.
మే 6న దేవరాజె గౌడ మాట్లాడుతూ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల పెన్‌డ్రైవ్ బైటపడడం వెనుక డికె శివకుమార్ హస్తం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ప్రధాని మోదీయే అన్నారు. ‘‘ఆ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మీద నమ్మకం లేదు. నా దగ్గరున్న ఆధారాలన్నింటినీ సీబీఐకి ఇస్తాను. బైటకు విడుదల చేసిన వీడియోలు కాకుండా వేరే వీడియోలు నా దగ్గర ఉన్నాయి’’ అని దేవరాజె గౌడ ప్రకటించారు.
మే 12న కర్ణాటక పోలీసులు దేవరాజె గౌడను లైంగిక వేధింపులు, అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసారు.