శ్రీలంక నువారా ఏలియాలోని అశోకవనం ప్రాంతంలో ‘సీత అమ్మ మందిరం’ నిర్మాణం జరుగుతోంది. ఆ ఆలయంలో సీతామాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య నుంచి పవిత్ర సరయూ జలాలను, మరికొన్ని కానుకలను పంపిస్తున్నారు.
శ్రీలంకలో రావణాసురుడు సీతమ్మను బంధించిన అశోకవనం ప్రదేశంలోనే ఆ అమ్మకు ఆలయం నిర్మిస్తుండడం విశేషం. ఆ కార్యక్రమ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు అయోధ్య జిల్లా యంత్రాంగం, రామమందిర ట్రస్ట్ సంయుక్తంగా ఆ నిర్ణయం తీసుకున్నాయి. సరయూనది నుంచి పవిత్ర జలాలను, మరికొన్ని ధార్మిక వస్తువులనూ సీతామాత ఆలయానికి కానుకగా పంపిస్తున్నాయి.
సీతామాత ఆలయ ప్రాణప్రతిష్ఠ మే 19, అంటే రేపు ఆదివారం జరగనుంది. ఆ కార్యక్రమం కోసం ఉత్తరప్రదేశ్ నుంచి ఒక బృందం మే 15న శ్రీలంక చేరుకుంది. వారు తమతో పాటు అయోధ్య రామమందిరం నుంచి పలు కానుకలు తీసుకువెళ్ళారు. ముఖ్యంగా, బాలక్‌రామ్ విగ్రహాన్ని రూపొందించిన కృష్ణశిలలోని ఒక ముక్కను సీతమ్మ గుడికి సమర్పిస్తారు. ప్రత్యేకంగా నేసిన చేనేత పట్టుచీరను సమర్పిస్తారు. దానిపై సీతారామలక్ష్మణహనుమ మూర్తులను చిత్రించారు. మరో మూడు ప్రత్యేకంగా తయారుచేసిన పట్టుచీరలు సీతమ్మకు కానుక చేస్తారు. సీతమ్మకు వెండి కాలిపట్టీలు, అమ్మవారి సింగారానికి ఉపయోగించే పెట్టె కూడా బహుమతిగా అందజేస్తారు.
సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం సరయూ జలాలతో పాటు భారతీయులు పరమ పవిత్రంగా పూజించే గంగానదీజలాలను కూడా ప్రత్యేక కలశాల్లో తీసుకువెళ్ళారు. ఇక వేంకటేశ్వరుడి కానుకగా తిరుమల తిరుపతి దేవస్థానం అందజేసిన 5వేల లడ్డూ ప్రసాదాలను కూడా సీతామందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చే భక్తులకు వితరణ చేస్తారని విశ్వహిందూపరిషత్ ప్రధాన కార్యదర్శి స్వామి విఖ్యానంత, నువారా ఏలియా అశోకవనం ఆలయ అధ్యక్షులు గౌరవ్ రాధాకృష్ణన్ వివరించారు.