ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో తనపై దాడి చేశారంటూ ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనను విచక్షణా రహితంగా కొట్టాడంటూ ఎంపీ స్వామి మాలీవాల్ చేసిన ఆరోపణపై కేసు నమోదు చేసిన పోలీసులు, బిభవ్ కుమార్ను అరెస్ట్ చేశారు.
బిభవ్ కుమార్ నివాసంలో శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణ కోసం స్టేషన్కు తరలించారు. పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారని బిభవ్ తరపు న్యాయవాది తెలిపారు. పోలీసు విచారణకు సహకరిస్తామన్నారు.
మే 13న సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై బిభవ్ దాడి చేశాడని ఎంపీ స్వామి ఫిర్యాదు చేసిన తరవాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనారోగ్యంగా ఉన్నానని చెప్పినా వినకుండా దాడికి దిగాడని స్వాతి మాలీవాల్ ఆరోపిస్తున్నారు. దాడి తరవాత కనీసం నడవలేకపోతున్నానని స్వామి వాపోయారు. అనుమతి లేకుండా సీఎం నివాసంలోకి స్వాతి దూసుకొచ్చి, తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బిభవ్ చెప్పుకొస్తున్నారు.