ఉత్తరాఖండ్‌లోని నాలుగు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బదరీనాథ్. ఆ నాలుగింటినీ కలిపి చార్ధామ్ అని పిలుస్తారు. హిందువులు ప్రతీయేటా పెద్దసంఖ్యలో చార్ధామ్ యాత్ర చేస్తారు. ఈ యేడాది మే 10న కేదారనాథ్ ఆలయ ద్వారాలు తెరవడంతో ఆ యాత్ర ప్రారంభమైంది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
‘‘ఈ యేడాది చార్ధామ్ యాత్రకు ఇప్పటికి సుమారు 27లక్షల మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు. గతేడాది మొత్తం చార్ధామ్ యాత్ర చేసిన భక్తుల సంఖ్యకు ఇది రెట్టింపు. మే 10న కేదారనాథ్ ఆలయ ద్వారాలు తెరచినప్పటి నుంచి ఇప్పటికి 2.76లక్షలకు పైగా భక్తులు చార్ధామ్ యాత్ర పూర్తిచేసారు. ముఖ్యంగా నాలుగే రోజుల్లో 1.26లక్షలకు పైగా భక్తులు కేదారనాథుణ్ణి దర్శనం చేసుకున్నారు’’ అని గఢ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే చెప్పారు.
ఆ నేపథ్యంలో, చార్ధామ్ యాత్రకు ఏర్పాట్లు, సన్నాహకాల తీరుతెన్నులపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దేవాలయాలకు 50 మీటర్ల పరిధిలోపల వీడియోలు తీయడం, రీల్స్ వంటివి చేయడాన్ని నిషేధించారు. ధార్మిక ప్రదేశాల్లో భక్తుల ఏకాగ్రతను చెదరగొట్టే అటువంటి చర్యలపై నిషేధం విధించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాతూరీ వెల్లడించారు. వీడియోలు తీయడం, రీల్స్ చేయడం వంటి చర్యలు భక్తుల ధార్మిక మనోభావాలను దెబ్బతీస్తాయి. ఆలయాల పవిత్రతను, భక్తుల గౌరవాన్నీ కాపాడే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు మొబైల్ ఫోన్లను తమతో తీసుకువెళ్ళవచ్చు. కానీ వీడియోలు తీయడం, రీల్స్ చేయడం నిషేధం అని రాధ వెల్లడించారు.
గతేడాది కేదారనాథ్ ఆలయం ఎదుట ఒక యువతి తన బోయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేస్తూ వీడియో షూట్ చేసి రీల్‌గా అప్లోడ్ చేసింది. ఆ రీల్ వైరల్ అవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో ఆలయ నిర్వాహకులు అటువంటి వీడియోలను ఆలయ పరిసరాల్లో తీయవద్దని కోరారు. దాంతో ఈ యేడాది ప్రభుత్వమే ఈ నియమాన్ని తీసుకొచ్చింది.
మరోవైపు, భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున చార్ధామ్ ఆలయాలకు వీఐపీల దర్శనాన్ని మే 31 వరకూ అనుమతించడం లేదని కూడా ప్రధానకార్యదర్శి స్పష్టం చేసారు. ఆ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ లేఖలు పంపించారు.