భారత్ అణుసత్తా చాటి 50 ఏళ్లైంది. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా పేరుతో 1974 మే 18న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజస్థాన్‌లోని ఫోఖ్రాన్‌లో అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. శాంతియుత అణుపరీక్షలు నిర్వహించినట్లు అప్పటి ఇందిర ప్రభుత్వం ప్రకటించింది. అయినా అనేక దేశాలు భారత్‌పై తీవ్ర ఆంక్షలు విధించాయి.
అణపరీక్షలకు ముందు భారీ కసరత్తే జరిగింది. చైనాతో యుద్ధం, పాక్‌తో రెండుసార్లు యుద్ధాలు జరగడంతో భారత్ అణుసత్తా చాటుకోవాలని నిర్ణయించుకుంది. 1962లో చైనా దురాక్రమణకు దిగింది. అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. భారత్, చైనా యుద్ధం తరవాత రెండేళ్లకే చైనా అణుపరీక్షలు నిర్వహించింది. దీంతో భారత్ అణుసత్తా చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించింది.
స్వాతంత్య్రానికి మూడేళ్ల ముందే ముంబైలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఏర్పాటు చేశారు. అప్పుడే భారత్‌లో అణు పరిశోధనలకు బీజం పడింది.స్వాతంత్ర్యం వచ్చాక అణు పరిశోధనలకు అప్పటి ప్రధాని నెహ్రూ అనుమతించారు. అయితే శాంతియుత కార్యక్రమాలు పరిమితం చేయాలని నిర్ణయించారు.
హోమీ బాబా ఆధ్వర్యంలో అణ్వాయుధ రూపకల్పనకు అడుగులు పడ్డాయి. 1954 నుంచి ఐదేళ్లపాటు పరిశోధనలు జరిగాయి. హోమీబాబా మరణం తరవాత ఆ బాధ్యతలు రాజా రామన్న స్వీకరించారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తరవాత అణు కార్యక్రమాలను విక్రమ్ సారాబాయ్ పర్యవేక్షించారు.
1966లో ప్రధానిగా ఇందిరాగాంధీ బాధ్యతలు స్వీకరించారు. అణు కార్యక్రమాలు జోరందుకున్నాయి. అణు సాధనాన్ని రూపొందించి పరీక్షించడానికి ఇందిరాగాంధీ అనుమతించారు. 1972 నుంచి రెండేళ్లపాటు వందలాది శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమించి అణుపరీక్షలకు ఫోఖ్రాన్ ప్రాంతంలో రంగం సిద్దం చేశారు.
1974 మే 18 ఉదయం 8 గంటలకు అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. అప్పటికే అణుపరీక్షలు నిర్వహించిన అమెరికా, ఫ్రాన్స్, చైనా దేశాల సరసన భారత్ నిలిచింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం (ఎన్పీటీ) ఏర్పాటైన ఆరేళ్ల తరవాత భారత్‌లో అణుపరీక్షలు జరగడం గమనార్హం.