EC warns
Congress President on Voter Turnout Charge
ఎన్నికల్లో ఓటర్లు
పాల్గొన్న గణాంకాల వివరాల్లో (ఓటర్ టర్న్-ఔట్ డేటా) అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమ ఇండీ కూటమి సభ్య పక్షాలకు రాసిన లేఖపై
ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈసీఐ విశ్వసనీయత అత్యంత కనిష్ట స్థాయికి
పడిపోయిందంటూ ఖర్గే చేసిన విమర్శకు ఆ సంస్థ ఘాటుగా సమాధానమిచ్చింది. కాంగ్రెస్
అధ్యక్షుడు ‘అయోమయం కలిగించడానికి, తప్పుదోవ పట్టించడానికి, స్వేచ్ఛగా న్యాయంగా
జరుగుతున్న ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు కలిగించడానికీ’ నిరాధారమైన ఆరోపణలు
చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్నికల సంఘం గతంలో
ఎన్నడూ లేనివిధంగా తీవ్రమైన పదజాలంతో తమ ప్రతిస్పందనను విడుదల చేసింది. మల్లికార్జున
ఖర్గే తమ రాజకీయ సమూహంలో అంతర్గత లేఖ రాసినట్లు రాసినప్పటికీ దాన్ని ‘ఎక్స్’
సామాజిక మాధ్యమంలో ఉంచడం ద్వారా బహిర్గతం చేసారని ఈసీ గమనించింది. ‘ఎన్నికల తుది
ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నం జరుగుతోందా?’ అంటూ ఖర్గే ప్రశ్నించడాన్ని
తీవ్రంగా ఖండించింది. ఆ లేఖ వ్యవస్థపై అనుమానాలను రేకెత్తించడం, అపోహలు కలిగించడమే
కాకుండా అరాచకత్వానికి దారితీసేలా ఉందంటూ మండిపడింది. ఆ లేఖలో ఖర్గే చేసిన ఆరోపణలు
ఎన్నికల సంఘాన్ని పరోక్షంగా నిందించడం, దూషించడమేననీ, ఎన్నికల ప్రక్రియలోని
కీలకాంశాలపై దాడి చేయడమేననీ ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్నికల మొదటి దశలో ఓటర్ల
హాజరీ సుమారు 5.5శాతం, రెండో దశలో 5.74శాతం పెరిగిందన్న సమాచారాన్ని ఈసీఐ ఆలస్యంగా
విడుదల చేసిందని ఖర్గే ఆరోపించారు. అలాంటి ఆలస్యమేమీ జరగలేదని ఈసీ వివరించింది.
పోలింగ్ జరిగిన రోజు విడుదల చేసే గణాంకాలను తర్వాత అప్‌డేట్ చేయడం ఎప్పుడూ ఉండే
పద్ధతేనని గుర్తు చేసింది.
ఎన్నికల తరువాతి దశలకు
సంబంధించిన ఓటర్ల తుది జాబితాలను బహిరంగపరచలేదంటూ కొన్ని మీడియా కథనాలను బట్టి
ఆరోపణ చేయడాన్ని ఈసీ తప్పుపట్టింది. ఓటర్ల జాబితాలను ఎన్నికల కమిషన్ పారదర్శకంగా తయారు
చేస్తుందన్న సంగతి ‘సీనియర్ పార్లమెంటుసభ్యుడిగా, సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో
ఉన్న నాయకుడిగా, ప్రముఖ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా’ ఆయనకు తెలిసే ఉంటుందని
గుర్తుచేసింది. ఎన్నికల ప్రక్రియలోని ప్రతీ దశలోనూ ఓటర్ల సంఖ్య గురించి పార్టీలకు
వివరాలు తెలుస్తూనే ఉంటాయని గుర్తుచేసింది.
మల్లికార్జున ఖర్గే లేఖపై
అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ ‘మీరు చేసిన వ్యాఖ్యలు, పరిశీలనలు, ఆరోపణలు… రాజ్యాంగ
పరిధులకు లోబడి తాము చేసే కృషిని నీరుగార్చేలా ఉన్నాయం’టూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘‘మీ లేఖ ద్వారా
వ్యాపింపజేస్తున్న తప్పుడు సందేహాలు, అపోహలు ఎన్నికల నిర్వహణ అనే సున్నితమైన
ప్రక్రియలో భాగమైన ఎన్నికల సంఘం మీద ఓటర్లలోనూ, రాజకీయ పార్టీలలోనూ ఉద్దేశపూర్వకంగా
అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ‘తుది ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నం
జరుగుతోందా?’ అన్న మీ ప్రశ్న అరాచక పరిస్థితులకు దారితీసేలా ఉంది. మీ ఉద్దేశం అది
అవకూడదని ఆశిస్తున్నాము. భారతదేశపు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అన్ని పక్షాలూ,
ప్రత్యేకించి దేశ ప్రజలు మీ ఈ పరిశీలనలను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చుతారని కమిషన్‌కు
పూర్తి విశ్వాసం ఉంది’’ అంటూ ఈసీ తీవ్రంగా స్పందించింది.
మల్లికార్జున ఖర్గే తన
లేఖలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యంత కనిష్ట స్థాయికి
పడిపోయిందని ఆరోపించారు. మొదటి రెండు దశల ఎన్నికల పోలింగ్ శాతాల విడుదలలో ‘బహుశా దేశ
చరిత్రలోనే మొట్టమొదటిసారి’ జాప్యం జరిగిందని ఆరోపించారు. అలా జరగడానికి ఈవీఎంల
వినియోగమే కారణమా? అంటూ ఈవీఎంలపై సందేహాలు కలిగేలా ప్రశ్నించారు.
ఇంకా మరికొన్ని అంశాలను తప్పుల్లా
ప్రస్తావిస్తూ, ఖర్గే ఇండీ కూటమిలోని ఇతర పార్టీల నాయకులకు లేఖ రాసారు. అలాంటి
తప్పులకు ఎలక్షన్ కమిషన్‌ను బాధ్యురాలిని చేయాలని, ఆ సంస్థ స్వతంత్రంగా పనిచేసేలా
చూడాలనీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఖర్గే చేసిన ఆరోపణలు ఎలాంటి ఆధారమూ లేనివని ఈసీ
మండిపడింది.