సత్యవేడులో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. సత్యవేడు మళ్ళీ తన ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ అధిష్టానం రకరకాల ప్రయోగాలు చేసింది.
తిరుపతి సిట్టింగ్ ఎంపీని ఇక్కడి నుంచి పోటీకి దింపాలని భావించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆదిమూలంను పక్కన బెట్టి నియోజకవర్గ సమన్వయకర్తగా గురుమూర్తిని నియమించారు. వైసీపీ కోర్ కమిటి నిర్ణయాలను వ్యతిరేకించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఎన్డీయే అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై శాసనసభకు పోటీ చేస్తున్నారు. దీంతో మరోసారి తీవ్ర కసరత్తు చేసిన వైసీపీ అధిష్టానం, మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ సోదరి కుమారుడైన నూకతోటి రాజేశ్ కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ నుంచి బాలగురువం బాబు బ్యాలెట్ ఫైట్ కు దిగారు.
2019 లో వైసీపీ నుంచి పోటీ చేసిన కోనేటి ఆదిమూలం , టీడీపీ అభ్యర్థి జడ్డా రాజశేఖర్ పై 44, 744 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో ఈ స్థానంలో టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య తారచంద్రకాంత్ 4, 227 ఓట్ల మెజారిటీతో వైసీపీ నుంచి పోటీ చేసిన కోనేటి ఆదిమూలంపై నెగ్గారు. 1983 నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆరుసార్లు విజయం సాధించింది. 2009 లో టీడీపీ గెలవగా కాంగ్రెస్ రెండోస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ప్రజారాజ్యం అభ్యర్థి 13 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది.