ఆంధ్రప్రదేశ్
లోని తిరుపతి లోక్‌సభ స్థానంలో పట్టు కోసం ప్రధానపార్టీలు తీవ్రంగా
పోరాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడు లోక్‌సభ స్థానాల్లో తిరుపతి
కూడా ఒకటి. 1952లో మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పడిన ఈ స్థానం నుంచి తొలిసారి
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.అనంతశయనం అయ్యంగార్ ఎన్నికయ్యారు. అనంతరం
పదకొండుసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది.
టీడీపీ,
బీజేపీ ఓ మారు విజయం సాధించగా, వైసీపీ మూడుసార్లు జయకేతనం ఎగురవేసింది.
2019
లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున బల్లి
దుర్గాప్రసాదరావు గెలిచారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో… 2021లో జరిగిన ఉప
ఎన్నికల్లో….ఫ్యాన్ గుర్తుపై మద్దెల
గురుమూర్తి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,71,592
భారీ ఓట్ల మెజారిటీతో గురుమూర్తి
గెలుపొందారు.
బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 57,800 ఓట్లు పడగా కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్
కు 9,585 ఓట్లు పడ్డాయి.
తిరుపతి, సర్వేపల్లి, గూడూరు, సూళ్ళూరుపేట,
వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు తిరుపతి
పార్లమెంటు పరిధిలో ఉన్నాయి.
మొదట్లో
చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉండేది. అయితే జిల్లాల విభజన
నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు పార్లమెంటు పరిధిలోకి
వెళ్లగా…శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి
నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు పరిధిలో చేరింది.
సిట్టింగ్
ఎంపీ గురుమూర్తికే మళ్ళీ వైసీపీ టికెట్
కేటాయించింది. ఎన్డీయే తరఫున బీజేపీ నుంచి వరప్రసాదరావు
నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దిగా చింతా మోహన్ పోటీలో
ఉన్నారు
కేంద్రంలో
బిజెపి చేపడుతున్న సంస్కరణలు, సంక్షేమ
కార్యక్రమాలు వంటి అంశాలు తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ
విశ్లేషకులు భావిస్తున్నారు.
కులసమీకరణాలు, పార్టీలకు దశాబ్దాల నుంచి ఉన్న కేడర్ ఈ
ప్రాంతంలో ఫలితాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.
1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్.
వెంకటస్వామి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చింతా మోహన్ పై విజయం సాధించారు.
2004లో
మాత్రం పరిస్థితి తారుమారైంది. బీజేపీ అభ్యర్థి వెంకటస్వామిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చింతా మోహన్ సుమారు
రెండు లక్షల మెజారిటీతో గెలిచారు.
2009 ఎన్నికల్లో బీజేపీ నాలుగో స్థానానికి
పడిపోయింది. కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ గెలవగా, టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య
రెండో స్థానంలో ప్రజారాజ్యం నుంచి బరిలోకి దిగిన వెలగపల్లి వరప్రసాదరావు మూడో
స్థానంలో నిలిచారు. 2014 నుంచి ఎన్నికలు జరిగిన ప్రతీ సారి వైసీపీ జెండానే ఇప్పటి
వరకు రెపరెపలాడింది.
2014లో వైసీపీ నుంచి వరప్రసాదరావు గెలవగా బీజేపీ రెండో
స్థానానికి పరిమితమైంది. రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి లోక్ సభ లో కాంగ్రెస్
గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.