Rajampet Parliamentary Constituency Profile
2022లో కొత్తగా ఏర్పాటు చేసిన అన్నమయ్య
జిల్లాలోని లోక్‌సభ స్థానం రాజంపేట. ఆ నియోజకవర్గం 1952లో ఏర్పాటయింది. అయితే
1957లో అక్కడ మొదటిసారి ఎన్నికలు జరిగాయి.
రాజంపేట పార్లమెంటరీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ
సెగ్మెంట్లు ఉన్నాయి. అవి రాజంపేట, (రైల్వే)కోడూరు, రాయచోటి, తంబళ్ళపల్లె, పీలేరు,
మదనపల్లె, పుంగనూరు. వాటిలో మొదటి ఆరూ అన్నమయ్య జిల్లాలో ఉంటే పుంగనూరు ఒక్కటీ
చిత్తూరు జిల్లాలో ఉంది.
రాజంపేటలో మొదటినుంచీ కాంగ్రెస్ ప్రాబల్యం
ఎక్కువ. 1957లో కాంగ్రెస్, 1962లో స్వతంత్ర పార్టీ గెలిచాయి. 1967, 1971, 1977,
1980 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ నుంచి పోతుగారి పార్థసారధి విజయం సాధించారు.
1984లోనూ, ఆ తర్వాత 1999లోనూ మాత్రం తెలుగుదేశం గెలిచింది. 1989, 1991, 1996, 1998,
2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి అన్నయ్యగారి ప్రతాప్ విజయయాత్ర
కొనసాగింది.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014, 2019
ఎన్నికల్లో వైఎస్ఆర్సిపియే గెలుపు దక్కించుకుంది. వైసీపీలో పెద్దతలకాయ అయిన
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పీవీ మిధున్ రెడ్డి 2014లో బీజేపీ అభ్యర్ధి
దగ్గుబాటి పురందరేశ్వరి, 2019లో టిడిపి అభ్యర్ధి డిఎ సత్యప్రభలను ఓడించారు.
ఇప్పుడు 2019లో మిధున్‌రెడ్డి
హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. అధికార వైఎస్ఆర్సిపి తరఫున సిట్టింగ్ ఎంపీగా
బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ప్రత్యర్ధిగా ఎన్‌డిఎ కూటమి నుంచి బిజెపి తరఫున ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి నిలబడ్డారు. దాదాపు
పదేళ్ళ తర్వాత కిరణ్ రాజకీయ రంగ పునఃప్రవేశంగా చెప్పుకోవచ్చు. ఇండీ కూటమి నుంచి
కాంగ్రెస్ అభ్యర్ధిగా షేక్ బషీద్ పోటీ చేస్తున్నారు.