సింహాచలంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ముగిసింది. వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాత్రి ఒంటిగంటకు స్వామివారి సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించారు. స్వామివారి దేహంపై చందనం తొలగించి నిజస్వరూపంలోకి తీసుకొచ్చారు.
సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చందనోత్సవాన్ని పురస్కరించుకుని తొలి దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. స్వామి వారి దర్శనం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న వేలాది మంది భక్తులు చందనోత్సవంలోపాల్గొని తరించారు. భక్తుల గోవింద నామాలతో సింహాద్రి ఆలయ పరిసరాలు మార్మోగాయి.