ఏపీలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మరో హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానంటూ కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. ముస్లింల రిజర్వేషన్లు తీసేసిన బీజేపీతో టీడీపీ, జనసేన నేతలు పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ముస్లింల రిజర్వేషన్లు తీసివేయడానికి కారణమైన ఎన్డీయేలో టీడీపీ,జనసేన చేరడంపై ఆయన ధ్వజమెత్తారు.
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఎమ్మెల్యేలనో, ఎంపీలనో గెలిపించడానికి కాదని, సంక్షేమ పథకాలు రద్దు కాకుండా ఉండాలంటే వైసీపీని గెలిపించాలని కోరారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని హెచ్చరించారు.సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీయాలంటే వైసీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.