Chautala
camp MLAs meet BJP Khattar amid Haryana Crisis
హర్యానాలో స్వతంత్ర అభ్యర్ధుల
మద్దతు ఉపసంహరణతో బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో
దుష్యంత్ చౌతాలా వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ అవడం
రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీకి గతంలో
మిత్రపక్షంగా ఉండి, కొన్నాళ్ళ క్రితం ఎన్‌డిఎ నుంచి బైటకు వచ్చేసిన దుష్యంత్
చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇవాళ మాజీ
ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు. ఖట్టర్ గద్దె దిగాక కొత్తగా
ముఖ్యమంత్రి అయిన నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి ఇటీవలే ముగ్గురు స్వతంత్ర
ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. దాంతో సైనీ ప్రభుత్వానికి గండం పొంచి
ఉంది. ఆ నేపథ్యంలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో నలుగురు ఎమ్మెల్యేల భేటీ ఆసక్తి కలిగిస్తోంది.
రాష్ట్రంలోని సహాయమంత్రి
మహీపాల్ ధాండా నివాసంలో పానిపట్‌లో ఆ సమావేశం చోటు చేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం
సుమారు 2 గంటల ప్రాంతంలో జేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ధాండాతో పాటు మనోహర్‌లాల్
ఖట్టర్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ అనిశ్చిత పరిస్థితి గురించే వారు
చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సమావేశం
వివరాల గురించి చెప్పడానికి ధాండా నిరాకరించారు.
రెండురోజుల క్రితం దాద్రీ ఎమ్మెల్యే సోంబీర్
సంగ్వాన్, పూండ్రీ ఎమ్మెల్యే రణధీర్ సింగ్ గోలెన్, నిలోఖేరీ ఎమ్మెల్యే ధరంపాల్
గోండెర్… బీజేపీ ప్రభుత్వానికి తాము ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకున్నారు. ఆ
వెంటనే దుష్యంత్ చౌతాలా మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనీ, కాంగ్రెస్
కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయాలచుకుంటే తాను బైటినుంచి మద్దతు ఇస్తాననీ ప్రకటించారు.
అక్కడితో ఆగని దుష్యంత్ చౌతాలా, శాసనసభలో
బలపరీక్ష నిర్వహించాలంటూ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసారు. అయితే మొన్న ఫిబ్రవరిలోనే
కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసతీర్మానం విషయంలో బలపరీక్ష జరిగినందున, సాంకేతికంగా
ఆరునెలలు పూర్తయేవరకూ మళ్ళీ బలపరీక్ష పెట్టనక్కరలేదు. మరోవైపు, నవంబర్‌లో హర్యానా
శాసనసభ గడువు కూడా ముగిసిపోనుంది.