కడప లోక్ సభ పరిధిలోని బద్వేలు శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్ జిల్లాలోని ఏకైక ఎస్సీ రిజర్వుడు స్థానం. కాశినాయన, కలసపాడు, పోరుమావిళ్ల, బీ కోడూరు, బద్వేల్, గోపవరం, అట్లూరు మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. బద్వేల్, పోరుమావిళ్ల పెద్ద టౌన్లుగా ఉండగా, బద్వేలు మున్సిపాలిటీ గా ఉంది. మొత్తం 2 లక్షల 18 వేల 740 ఓటర్లు ఉన్నారు.
వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమైన బద్వేల్ లో గతంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉండేవి. చాలా మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు.
బ్రహ్మంసాగర్ డ్యాం నిర్మాణంతో కొంత వరకు నీటి సమస్యకు పరిష్కారం దొరికింది. బద్వేల్ పెద్ద చెరువుకు నీటిని నింపితే అక్కడి నుంచి నియోజకవర్గంలోని 50 చెరువులకు పంపిణీ చేయవచ్చు.
సోమశిల నుంచి బ్యాక్ వాటర్ ను లిఫ్ట్ ద్వారా తరలిస్తామని చేసిన వాగ్దానం ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్లై వుడ్ పరిశ్రమ రావడంతో అక్కడ 12 వందల మందికి ఉపాధి లభించింది.
1955 నుంచి ఇప్పటి వరకు 16సార్లు ఎన్నికలు జరిగాయి. . రెండు సార్లు ఉపఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు కాంగ్రెస్, ఒక సారి స్వతంత్ర్య అభ్యర్ధి, జెఎంపి ఒకసారి, ఐసీజే ఒకసారి, నాలుగుసార్లు తెలుగుదేశం, మూడుసార్లు వైసీపీ విజయం సాధించాయి.
ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా డాక్టర్ సుధా తిరిగి వైసీపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్న, కాంగ్రెస్ పార్టీ నుంచి విజయజ్యోతి పోటీలో ఉన్నారు. ఈ మూడు పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ జరగనుంది.
ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ…వైసీపీ ప్రచారం చేస్తుంటే … రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతోందని తద్వారా నియోజకవర్గానికి మరింత ప్రయోజనం జరుగుతుందని రోషన్న చెబుతున్నారు.