ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లోని రాజకీయం, అభ్యర్థుల గెలుపోటములపై తీవ్రమైన చర్చ జరుగుతుంటుంది. అక్కడ జరిగే పరిణామాలు తెలుసుకోవాలనే కుతుహలం రాజకీయాలు ఇష్టపడే ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అలాంటి నియోజకవర్గల్లో కడప పార్లమెంటు ఒకటి.
వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోకి కడప లోక్ సభ స్థానంలో 1989 నుంచి వెఎస్ కుటుంబానిదే హవా. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి తర్వాత జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వరుసకు సోదరుడు అయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కానీ ఈ దఫా అక్కడ ఎవరూ ఊహించని ట్వీస్ట్ చోటుచేసుకుంది.
వైసీపీ అధినేత జగన్ కు చెల్లళ్ల నుంచి రాజకీయ గండం పొంచి ఉంది. అవును ఆయన తోబుట్టువు షర్మిల ఈ దఫా హస్తం గుర్తుపై లోక్ సభకు పోటీ చేస్తున్నారు. షర్మిలకు మాజీ మంత్రి వైఎస్ వివేకనందరెడ్డి కుమార్తె సునీత మద్దతు తెలిపారు. వైఎస్ ఇంటి ఆడబిడ్డలైన ఈ ఇద్దరూ వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి ఓటమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి వైసీపీ టికెట్ ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. షర్మిలను కడప నుంచి లోక్ సభకు పంపడమే వివేకానందరెడ్డి చివరి కోరిక అని తమను ఆశీర్వదించాలని గడప గడపకు తిరిగి అక్కా చెల్లెళ్లు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల, బీజేపీ, జనసేన మద్దతుతో టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి పోటీలో ఉన్నారు.
కడప లోకసభ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించగా తొలి నుంచి జనరల్ కేటగిరిలోనే ఉంది. తొలిసారి ఎన్నికల్లో ఇక్కడ సీపీఐ విజయం సాధించింది. మొత్తం నాలుగు సార్లు సీపీఐ అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో గెలిచారు. టీడీపీ 1984లో మాత్రమే విజయం సాధించింది. ఇది మొదటి నుంచి జనరల్ కేటగిరిలోనే ఉంది.
1989 నుంచి వైఎస్ కుటుంబమే కడప లోక్ సభలో గెలుస్తోంది. 2014, 2019లో వైసీపీ తరఫున వైఎస్ అవినాశ్ రెడ్డి నెగ్గారు. అంతకు కాంగ్రెస్ నుంచి ఓ మారు, వైసీపీ నుంచి ఓసారి జగన్ లోక్ సభకు ఎన్నికయ్యారు.2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిపై వైసీపీ అభ్యర్థి వై.ఎస్. అవినాష్‌రెడ్డి విజయం సాధించారు.
కడప లోక్‌సభ పరిధిలో కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు (ఎస్సీ) శాసనసభా స్థానాలు ఉన్నాయి. 16,18,887 ఓటర్లు ఉండగా, పురుషులు 7,93,421 మంది, మహిళలు 8,25,242 మంది ట్రాన్స్ జెండర్లు 224 మంది ఓటర్లు ఉన్నారు.