కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం రాత్రి భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఏ తయ్యబాకు చెందిన కీలక కమాండర్ సహా మొత్తం ముగ్గురు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ రెడ్‌వానీ పయీన్ ప్రాంతంలో సోమవారం నుంచి భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ తరవాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఏ తయ్యబాకు చెందిన ఆఫ్‌షూట్ గ్రూప్, ది రెసిస్టెంట్ ఫ్రంట్ కమాండర్ హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కీలక తీవ్రవాది దార్, మోమిన్ గుల్జార్, ఫహీమ్ అహ్మద్ బాబా హతమయ్యారు.
ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు 18 హత్యల్లో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదంపై పోరులో ఇది పెద్ద విజయమని జమ్ము కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు.
మే 4న పూంచ్ సెక్టర్‌లో భద్రతా దళాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఆ దాడిలో ఒక అధికారి మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. అప్పటి నుంచి భద్రతా దళాలు ఉగ్రవేట ముమ్మరం చేశాయి.