ధర్మవరం
అసెంబ్లీ నియోజకవర్గంలో మూడోసారి విజయం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.
వెంకట్రామిరెడ్డి 2009లో కాంగ్రెస్ నుంచి
పోటీ చేసి గెలిచారు. 2019లో వైసీపీ తరఫున విజయం సాధించారు. ప్రస్తుతం వైసీపీ తరఫున
బ్యాలెట్ ఫైట్ కు దిగగా , బీజేపీ తరఫున ఆ పార్టీ
అగ్రనేత సత్యకుమార్ బరిలో ఉన్నారు. సత్యకుమార్ కు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు
తెలిపాయి.
బీజేపీ నుంచి వరదాపురం సూరి, టీడీపీ నుంచి పరిటాల శ్రీరాం టీడీపీ నుంచి
పోటీకి ఆసక్తి చూపినప్పటికీ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సత్యకుమార్ పోటోలో
ఉన్నారు. దీంతో స్థానికులైన సూరి, శ్రీరామ్ సైడ్ అయిపోయారు.
ఫ్యాక్షన్
కుటుంబ నేపథ్యమున్న కేతిరెడ్డి వెంకట్రామిరామిరెడ్డి 2009లో హస్తం గుర్తుపై పోటీ
చేసి గోనుగుంట్ల సూర్యనారాయణపై సుమారు 19 వేల ఓట్ల మెజారిటీ సాధించారు.
కేతిరెడ్డి 2019లో
గెలిచిన తర్వాత ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ పేరిట ప్రజలతో మమేకం అయ్యారు.
నియోజకవర్గంలోని ప్రతీ మారుమూల గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలపై ఆరా తీశారు.
ధర్మవరంలో చేనేతలు ఎక్కువగా ఉండటంతో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం
పథకం ద్వారా 15 వేల కుటుంబాలకు మేలు జరిగిందని ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి
చెబుతున్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకు రూ. 700 కోట్లతో జలాశయాల నిర్మాణం
చేపట్టినట్లు అలాగే రూ. 150 కోట్లతో విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ ఫార్మర్లు
ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని 97 వేల కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం
ద్వారా మేలు జరిగిందని లెక్కలతో వివరిస్తున్నారు.
బీజేపీ
అభ్యర్థి సత్యకుమార్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. జనసేన, టీడీపీ మద్దతుతో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
తనను గెలిపిస్తే తనకు కేంద్రంలో ఉన్న పరిచయాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి
చేస్తానని చెబుతున్నారు. వైసీపీ హయాంలో ఆక్రమణలు, అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగాయని
విమర్శిస్తున్నారు.