Modi fires
on Sam Pitroda Controversial Remarks
కాంగ్రెస్ సీనియర్
నాయకుడు శాం పిట్రోడా తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత రాహుల్
గాంధీ స్పందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిమాండ్ చేసారు. ‘‘దేశ ప్రజలను ఒంటిరంగు
ఆధారంగా అవమానించడాన్ని సహించబో’’మంటూ మోదీ మండిపడ్డారు.
శాం పిట్రోడా గతవారం
అమెరికా తరహాలో భారత్‌లో వారసత్వపు పన్ను విధించాలంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి
ఇబ్బందికరంగా నిలిచాయి. ఆయనే తాజాగా ఓ పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘భారతదేశంలో
వైవిధ్యం ఎక్కువ. తూర్పుభారతదేశంలో ప్రజలు చైనావాళ్ళలా ఉంటారు. పశ్చిమభారతంలోని
ప్రజలు అరబ్బుల్లా ఉంటారు. ఉత్తరభారత ప్రజలు తెల్లగా ఉంటారేమో. దక్షిణాది ప్రజలు
ఆఫ్రికావాళ్ళలా నల్లగా ఉంటారు’’ అని పిట్రోడా అన్నారు.
ఇవాళ తెలంగాణలోని వరంగల్‌లో
ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ శాం పిట్రోడా వ్యాఖ్యలపై
విరుచుకుపడ్డారు. ‘‘ఓ యువరాజా (రాహుల్‌గాంధీ), దీనికి నువ్వు జవాబు చెప్పాలి. మన
దేశ ప్రజలను ఒంటి రంగు ఆధారంగా అవమానించడాన్ని దేశం సహించదు. మోదీ ఎట్టి
పరిస్థితుల్లోనూ సహించడు’’ అంటూ నిలదీసారు.
కాంగ్రెస్ స్వభావంపై
మోదీ తన వ్యాఖ్యలు కొనసాగించారు. ‘‘రాష్ట్రపతి
ఎన్నికలో ద్రౌపది ముర్ము అభ్యర్ధిత్వాన్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందా అని
నేను ఆశ్చర్యపోయాను, ఎందుకో నాకు అప్పట్లో అర్ధం కాలేదు. కానీ ఒక ఆదివాసీ అయిన
ద్రౌపది ముర్మును ఓడించడానికి వారెందుకు ప్రయత్నించారో నాకు ఇప్పుడు అర్ధమైంది.
యువరాజు మామయ్య ఒకరు అమెరికాలో ఉంటారు. ఆయనే యువరాజుకు మార్గదర్శి. నల్లని మేనిచాయ
ఉన్నవారు ఆఫ్రికావాళ్ళు అని అన్నాడా మావయ్య. ఇప్పుడు నాకు అర్ధమైంది ఏంటంటే, వాళ్ళు
ద్రౌపది ముర్మును ఆఫ్రికా దేశస్తురాలు అనుకున్నారు, అందుకే ఆమె నల్లగా ఉందని
భావించారు. అందుకే ఆమెను ఓడించి తీరాలని తలచారు’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ విదేశీ విభాగం
వ్యవహారాల అధ్యక్షుడు శాం పిట్రోడా వ్యాఖ్యల మీద బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం
చేస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ
శర్మ, మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్, పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేదీ
తదితరులు శాం పిట్రోడా వ్యాఖ్యలను తప్పుపట్టారు.
పిట్రోడా వ్యాఖ్యలతో
కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని
తప్పించుకునే ప్రయత్నం చేసింది. ‘‘ఒక పాడ్‌కాస్ట్‌లో భారతదేశపు వైవిధ్యాన్ని వివరించడానికి
శాం పిట్రోడా చేసిన పోలికలు దురదృష్టకరం, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు. ఆ పోలికల
వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు ఏమాత్రం సంబంధం లేదు’’ అని జైరాం రమేష్ ‘ఎక్స్’ సోషల్
మీడియాలో ట్వీట్ చేసారు.