ప్రపంచలోని ఆధ్యాత్మిక కేంద్రాల్లో
ఒకటిగా విరాజిల్లుతున్న ప్రాంతాల్లో తెలుగునేల పుట్టపర్తి కూడా ఒకటి. చిత్రావతి
నది ప్రవహించే ఈ పుణ్యభూమిలో సత్యసాయి
ట్రస్ట్ ఆధ్వర్యంలో డీమ్డ్ యూనివర్సిటీతో పాటు అధునాతన వైద్య కళాశాల కూడా ఉంది.
మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న వైద్యాలయంలో లక్షలాది మందికి నాణ్యమైన వైద్యం
అందిస్తున్నారు.
గోరంట్ల, నల్లమడ నియోజకవర్గాలు
2009లో రద్దు కావడంతో పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడింది. గోరంట్ల
నియోజకవర్గంలోని 6 మండలాలైన బుక్కపట్నం, కొత్తచెరువు,
పుట్టపర్తి, నల్లమడ, ఓడిచెరువు, ఆమడుగూరు మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో టిడిపి
తరపున పోటీ చేసిన పల్లె రఘునాథరెడ్డి ఎన్నికయ్యారు.
2014లో జరిగిన ఎన్నికలలో వైఎస్సార్సీపీ
అభ్యర్థి కొత్తకోట సోమశేఖర్రెడ్డిపై మరోమారు టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి
గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టిడిపి
అభ్యర్ధి పల్లె రఘునాథ రెడ్డిపై 31వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట
శ్రీధర్ రెడ్డి గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా… వైసిపి తరపున సిట్టింగ్
ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి
టికెట్ కేటాయించడంతో…. ఆయనే ఎన్నికల బరిలో ఉన్నారు. టీడీపీ తరఫున పల్లె సింధూర
రెడ్డి, కాంగ్రెస్ తరపున దాదిరెడ్డి మధుసూదన్
రెడ్డి బరిలో వున్నారు.
పుట్టపర్తి నియోజకవర్గంలో మొత్తం
2లక్షల 10వేల 46 మంది ఓటర్లు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో పుట్టపర్తి శాసనసభ
స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధే మరోమారు పార్టీని గెలిపిస్తారని వైసీపీ అభ్యర్థి
ధీమాగా ఉంటే…. గతంలో టిడిపి చేసిన అభివృద్ధిని, కూటమి సాధించనున్న అభివృద్ధిని చూసి ఓటేస్తారని టిడిపి ధీమా వ్యక్తం
చేస్తుంటే… మరోవైపు కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ఆ
పార్టీ అభ్యర్ధి ప్రచారం చేస్తున్నారు.