తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఒకటైన హిందూపురం అసెంబ్లీలో ఈ సారి కూడా నందమూరి వారసుడు బాలకృష్ణ పోటీలో ఉన్నారు. నందమూరి కుటుంబం హిందూపురం నియోజకవర్గం నుంచి ఆరుసార్లు విజయం సాధించింది. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో ఆ పార్టీ జెండానే రెపరెపలాడుతోంది.ప్రత్యర్థులకు ఏ మాత్రం ఇవ్వకుండా ఆ పార్టీనే అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.
ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద బరిలో నిలిచారు. కూటమిలో భాగంగా ఆయన ఇక్కడి నుంచి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీనే తీసుకుంది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద బరిలో నిలిచారు.
హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతనులంతా తనకే మద్దతు తెలపాలని ఆయన కోరుతున్నారు. వైసీపీ నుంచి తిప్పెగౌడ నారయణ్ దీపిక పోటీలోఉన్నారు.
1983లో టీడీపీ తరఫున పమ్మిశెట్టి రంగనాయకులు గెలవగా, 1985, 1989, 1994 ఎన్టీఆర్ విజయం సాధించారు. 1996 లో జరిగిన ఉపఎన్నికలో నందమూరి హరికృష్ణ గెలిచారు. 1999 లో సీసీ వెంకటరాయుడు, 2004లో పమ్మిశెట్టి రంగనాయకులు గెలవగా, 2009లో అబ్దుల్ ఘని విజయం సాధించారు.
2014 లో సైకిల్ గుర్తు పై పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ, వైసీపీ నుంచి పోటీ చేసిన నవీన్ నిశ్చల్ ను 16 వేల ఓట్ల తేడాతో ఓడించారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన షేక్ మహ్మద్ ఇక్బాల్ ను 18 వేల ఓట్లతో ఓడించిన బాలయ్య, రెండోసారి శాసనసభలో అడుగుపెట్టారు.