కళ్యాణదుర్గం శాసనసభ స్థానంలో 12 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో బోయ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. తెలుగుదేశం పార్టీకి పట్టున్న స్థానాల్లో ఇదొకటి. కాంట్రాక్టరు అమిలినేని సురేంద్రబాబు ఈ దఫా సైకిల్ గుర్తుపై పోటీలో ఉండగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ తలారి రంగయ్య పోటీ చేస్తున్నారు.
అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తున్న అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల్లో సురేంద్రబాబు నే సంపన్నుడు. ఆయన స్థరాస్తుల విలువ రూ. 165.68 కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ. 10.93 కోట్లు. అలాగే అప్పులు రూ.39.68 కోట్లు ఉన్నట్లు అఫడివిట్ లో పేర్కొన్నారు.
వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తలారీ రంగయ్య కు మిగతా అభ్యర్థుల కంటే అత్యంత తక్కువ ఆస్తులు ఉన్నాయి. స్థిరాస్తుల విలువ రూ. 3.83 కోట్లుకాగా, చరాస్తుల విలువ రూ. 68.27 లక్షలు. అప్పులు రూ. 1.30కోట్లు ఉన్నాయి.
2019లో వైసీపీ నుంచి గెలిచిన ఉష శ్రీచరణ్‌పై అవినీతి, అక్రమాల ఆరోపణలు వచ్చాయి. టీడీపీ టికెట్ ను ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి ఆశించారు. శ్రీమంతుడు, కాంట్రాక్టర్ కావడంతో పాటు సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేపడుతున్న సురేంద్రబాబును టీడీపీ పోటీలో నిలిపింది. దీంతో ఉమామహేశ్వరనాయుడు వైసీపీలో చేరారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా జలాలను రెండేళ్ళలో కళ్యాణదుర్గానికి తీసుకొస్తానని టీడీపీ అభ్యర్థి వాగ్దానం చేశారు.
వైసీపీ ప్రభుత్వ పథకాలతో కొన్ని కుటుంబాలకు లబ్ధి జరిగినప్పటికీ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. దీంతో భవిష్యత్ కోసం మార్పు కోరుకునే అవకాశముందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉమామహేశ్వర నాయుడు 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశముంది.
వైసీపీ నుంచి పోటీ చేసిన ఎంపీ తలారి రంగయ్య కు వివాద రహితుడిగా పేరుంది. మంచి ట్రాక్ కలిగి ఉన్న రంగయ్య గతంలో డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు.
70 ఏళ్ళ కళ్యాణదుర్గం చరిత్రలో స్వతంత్రులతో పాటు కాంగ్రెస్, జనతా పార్టీ,సీపీఐ, వైసీపీ, టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి 2009లో ఈ స్థానం నుంచే గెలిచి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1983, 1994, 1999,2004,2014 లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.