అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలో నిలవగా తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని పోటీలో నిలిపింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ప్రభాకర్‌చౌదరిపై వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి గెలుపొందారు. ఈసారి ఫ్యాన్ గుర్తుపై ఆయనే మరోసారి బరిలో నిలవగా.. తెలుగుదేశం పార్టీ మాత్రం రాప్తాడు మాజీ ఎంపీపీ, పారిశ్రామికవేత్త దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ను రంగంలోకి దింపింది.
నగరంలో వేల సంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఏకంగా 23,500 మంది పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. సగం మందికిపైగా నగర ఓటర్లే ఉన్నారు.
వ్యవసాయ కుటుంబానికి చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ది రాప్తాడు మండలంలోని ఎం.బండమీద పల్లి స్వస్థలం. 2014-19 వరకు రాప్తాడు మండలాధ్యక్షుడిగా పనిచేసిన వెంకటేశ్వరప్రసాద్ ఉమ్మడి జిల్లా ఎంపీపీల అసోసియేషన్ అధ్యక్షుడిగాను, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఛాంబర్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
1980 నుంచి 1987 వరకు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన అనంతవెంకటరామిరెడ్డి 1987 నుంచి 1996 వరకు డీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1996, 1998, 2004, 2009లో అనంతపురం పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. వైసీపీ తరఫున 2014లో ఎంపీ గా నెగ్గారు. 2019లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచారు.