శింగనమల నియోజకవర్గం 1967లో ఏర్పడగా, 1978లో షెడ్యల్ కులాల రిజర్వుడు స్థానంగా మారింది. శింగనమల, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, యల్లనూరు, పుట్లూరు మండలాలు ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత నియోజకవర్గాల్లో ఈ స్థానమొకటి.
ప్రస్తుతం శింగనమల(ఎస్సీ రిజర్వుడు) శాసనసభస్థానంలో బండారు శ్రావణి టీడీపీ తరఫున పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి మన్నెపాకుల వీరాంజనేయులు పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందగా, ఆమె భర్త సాంబశివారెడ్డి పెత్తనం చెలాయించారని టీడీపీ ఆరోపించింది. వైసీపీ అధిష్టానం కూడా ఈ సారి పద్మావతికి బదులు కొత్త వ్యక్తికి టికెట్ కేటాయించింది. ఆయన గెలుపు బాధ్యతను సాంబశివారెడ్డికే అప్పగించింది.
గతంలో ఈ స్థానం నుంచి హస్తం గుర్తుపై పోటీ చేసి గెలిచిన సాకే శైలజానాథ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కూడా ఆయన కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు.
2014 లో ఈ స్థానంలో టీడీపీ జెండా రెపరెపలాడింది. వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతిపై టీడీపీ నుంచి పోటి చేసిన యామినిబాల గెలుపొందారు. మాజీ మంత్రి శమంతకమణి కుమార్తె యామినీబాల. 1985, 1994, 1999లో టీడీపీ అభ్యర్థి కె. జయరాం గెలవగా, 1989లో కాంగ్రెస్ నుంచి శమంతకమణి నెగ్గారు.