గుంతకల్లు నియోజకవర్గం నుంచి అనూహ్యంగా టీడీపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం బరిలోకి దిగారు. 2019 ఎన్నికల్లో ఆలూరు నుంచి గెలిచిన ఆయన మంత్రిగా పనిచేశారు. ఈ దఫా ఆలూరు టికెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి సైకిల్ గుర్తుపై పోటీలో ఉన్నారు. గుంతకల్లులో బోయ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 55 వేల వరకు ఉండటంతో అదే సామాజికవర్గానికి చెందిన జయరాంకు తెలుగుదేశం అవకాశమిచ్చింది. జయరాం రాకను టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వ్యతిరేకించినప్పటికీ ప్రస్తుతం హైకమాండ్ జోక్యంతో చల్లబడ్డారు.
వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. ఓటర్లు ఎక్కువగా ఉన్న గుంతకల్లు పట్టణం కీలకం కానుంది. కర్నూలు జిల్లా ఆలూరు నుంచి గుంతకల్లు నియోజకవర్గాల మధ్య దూరం 30 కిలోమీటర్లే నంటున్న జయరాం, తాను పుట్టింది గుంతకల్లు మండలంలోనే అంటున్నారు. తన బంధువర్గం అంతా అక్కడే ఉందంటున్నారు. స్వపక్షంతో పాటు కూటమి మద్దతుతో తన విజయం ఖాయమని దీమా వ్యక్తం చేస్తున్నారు.
‘‘వెనుకబడిన ముస్లిం మైనార్టీల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగిస్తామన్న ఎన్డీయే బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, జగన్ అధికారంలో ఉన్నంత వరకూ రిజర్వేషన్ కొనసాగుతుందని’’ వైసీపీ అభ్యర్థి వై.వెంకటరామిరెడ్డి ముస్లింలకు హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2009 లో గుంతకల్లు నుంచి కాంగ్రెస్ తరఫున మధుసూదన్ గుప్తా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి జితేంద్ర గౌడ్ పై ఆయన నెగ్గారు. 2019లో వెంకటరామిరెడ్డి కూడా జితేంద్ర గౌడ్ ను ఓడించారు. గత ఎన్నికల్లో జనసేన తరఫున మధుసూదన్ గుప్తా పోటీ చేశారు. గుంతకల్లలో 2,52, 352 మంది ఓటర్లు ఉండగా అందులో ఎక్కువ మంది రైల్వే ఉద్యోగులే ఉన్నారు. బ్రిటీషు కాలం నుంకచి రైల్వే టౌన్ గా రైల్వే జంక్షన్ గా గుంతకల్లు కొనసాగుతోంది.