Our Prime Ministers, Their Leadership and Administration
Skills – Special Series – Part 7
******************************************************************
సత్యరామప్రసాద్ కల్లూరిరచన : మన
ప్రధానమంత్రులు
******************************************************************
పాములపర్తి వెంకట
నరసింహారావు (28-06-1921 : 23-12-2004)
******************************************************************
లోక్‌సభ ఎన్నికలకు నెల ముందు శ్రీపెరుంబుదూరులో 1991 మే 21న
రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ వ్యక్తులు హత్య చేయడం రెండవ ఘట్టంలోని వోటింగ్ సరళిని
కొంతవరకూ ప్రభావితం చేసిందనే చెప్పాలి. అంతేగాక, కాంగ్రెసేతర ప్రభుత్వాల అస్థిరతతో ప్రజలు కొంతమేరకు విసిగిపోయి ఉండడం
కూడా మరొక కారణమై ఉండవచ్చు – దానితో అత్యధిక స్థానాలు సంపాదించుకున్న పార్టీగా మాత్రమే
కాంగ్రెసు తిరిగి అవతరించినా, ఈ ఎన్నికలలలో అది సగం సీట్లు కూడా
సంపాదించలేకపోయింది. (ఆధిక్యతకు 24స్థానాలు తక్కువ) అటువంటి సంకట పరిస్థితిలో
ఆ పార్టీకి దక్షుడైన నాయకుడి అవసరం ఏర్పడింది.
నెహ్రూ కుటుంబానికి మొదటినుండీ విధేయుడై
ఉండడమేగాకఅంతకుముందు ఇందిర, రాజీవ్‌ల పరిపాలనా కాలంలో ప్రముఖ శాఖలలో పనిచేసిన అనుభవం ఉన్న పీవీ
నరసింహారావు ప్రధాని కావడానికి పరిస్థితులన్నీ అనుకూలించాయి. ఆ పార్టీ ఆయనను
ప్రధానిగా ఉండవలసినదిగా ఆహ్వానించింది.
ఫలితంగా పీవీ 1991 జూన్ 27న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
వెంటనే నంద్యాల లోక్‌సభా నియోజక వర్గం నుండి గెలిచాడు. తన సామర్ధ్యాన్నీ,వ్యవహారదక్షతనూ ఉపయోగించి, 1996 మే (తదుపరి ఎన్నికల) వరకూ తమ పార్టీకి సగం
పట్టు లేకపోయినా,ఆ పార్టీని ఎన్నోసార్లు గట్టెక్కించి, పూర్తిగా ఐదేళ్ళపాటు పరిపాలించాడాయన.
పీవీ ప్రధానిగా పదవిలోకి వచ్చేనాటికి మన
దేశపు ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన అధికారంలోకి రాగానే చేసిన మొదటి
పని – అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్ సింగ్‌ను
ఆర్థికమంత్రిగా తీసుకోవడం. సింగ్ సలహాలను కచ్చితంగా పాటిస్తూ ఆర్థిక క్రమశిక్షణను
ప్రవేశపెడుతూనే, ఆర్థిక సరళీకరణ (గ్లోబలైజేషన్)నుప్రవేశపెట్టాడాయన. అంతేగాక, అభివృద్ధినిరోధకమైన
‘లైసెన్స్ అండ్ పర్మిట్ రాజ్ కు వెన్నెముక
అయిన పరిశ్రమల అభివృద్ధి నియంత్రణ చట్టం IDRAను తొలగించాడు. ఆ సాహసోపేత చర్యల కారణంగా అంతకుముందు దివాలా అంచుల వరకూ
వెళ్ళిన మన దేశపు ఆర్థికస్థితి గాడిలో పడడం మొదలయింది.
అయితే, ఆయన ప్రధానిగా ఉన్న కాలంలోనే – 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత, దానికి
ప్రతీకారంగా బొంబాయిలో 1993 మార్చి 12న వరుస ప్రేలుళ్ళు మొదలైన సంఘటనలు జరిగాయి. కొందరైతే “పీవీయే ఆ
మసీదును కూల్చివేయడానికి ప్రోత్సహించా”డని ఆరోపించారు కూడా!
ఆ వివాదాస్పద కట్టడం కూల్చివేత సమయంలో
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ ఉన్నాడు. ఆయన ఆ డిసెంబర్ 6న జరగబోయే కరసేవను శాంతియుతంగా జరిపిస్తానని మాట ఇవ్వడంతో పీవీ
దానికి అంగీకరించాడు. ఆ రోజున సుమారు లక్షన్నరమంది కరసేవకులు దేశం నలుమూలలనుండి వచ్చి
అక్కడ గుమిగూడారు. మొదట మురళీ మనోహర్ జోషీ, స్వామిని ఉమాభారతి అక్కడ మాట్లాడాక,అకస్మాత్తుగా ఆ గుంపు అసహనానికి గురైంది; ఎందరో బిగ్గరగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. మధ్యాహ్నమయేసరికి మొదట
ఒక వ్యక్తి గుమ్మటం మీదకు ఎక్కగా, అతడి వెనువెంట చాలామంది కూడా ఎక్కారు.
అంత జనసందోహం ఎదుట పోలీసులు నిశ్చేష్టులైపోయారు. కొందరు కరసేవకులు తమ ప్రాణాలకు తెగించి,
కొన్ని గంటలలో ఆ మొత్తం కట్టడాన్ని
కూల్చివేశారు! ఆ తరువాత దాని ప్రభావం ఢిల్లీ పొరుగు రాష్ట్రాలపైనేగాక, పొరుగు ఇస్లామిక్ దేశాలపైన కూడా పడింది; తత్ఫలితంగా 2,000 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.
(ఆ వివాదాస్పద కట్టడం కూల్చివేత జరిగాక
కళ్యాణ్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేశాడు. ఉత్తరప్రదేశ్‌లో అధ్యక్షపాలన మొదలై, సుమారు సంవత్సరం కొనసాగింది. ‘విశ్వహిందూపరిషత్, ఆరెస్సెస్‘ కొంతకాలం నిషేధించబడ్డాయి.)
ఇకముంబైలో 1993 మార్చి 12న వరుసప్రేలుళ్ళు జరిగిన సమయంలో మహారాష్ట్రలో శరద్ పవార్
ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ ప్రేలుళ్ళలో సుమారు 250 మంది మరణించారు; వేలాదిమంది గాయపడ్డారు. దానికి
సూత్రధారులు దావూద్ ఇబ్రహీం, అతడి సోదరుడు అనీస్, టైగర్ మెమన్. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో
బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ఆ
ప్రేలుళ్ళ ప్రణాళిక వేయబడిందట. RDX వంటి ఆధునిక
ప్రేలుడు
పదార్థాలను దీనికి ఉపయోగించారు. ఈ
ప్రాథమిక నిందితులు ముగ్గురూ దేశంనుండి సునాయాసంగా
తప్పించుకుని పారిపోగలిగారు. (ఆ
రోజులలో చాలామంది చెవులు కొరుక్కున్న మాట – శరద్ పవార్
ఆశీస్సులతోనే వాళ్ళు ముగ్గురూ
తప్పించుకుని పారిపోగలిగారని.) తరువాత మిగిలిన నిందితులు
సుమారు 700మందిపైన 1994లో విచారణ జరిగింది. టైగర్ మెమన్
సోదరుడు యాకూబ్ మెమన్ను మరికొందరిని 2015లో ఉరితీశారు.మరికొందరు ఇంకా చెరసాలల్లోనే ఉన్నారు.
అటువంటి సంఘటనలెన్నో పీవీకి చెడ్డపేరు
తెచ్చిపెట్టాయి; దాని ఫలితంగా తరువాత వచ్చిన ఎన్నికలలో
కాంగ్రెస్‌కు వచ్చిన స్థానాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీనికి విరుద్ధంగా
బాబ్రిమసీదు కూల్చివేత ఘటన తరువాత ఉత్తరభారతంలో భాజపా (భారతీయజనతా పార్టీ) బాగా పుంజుకోవడం
మొదలయింది.
పీవీ పరిపాలనలో మెరుగైన ప్రగతి,
చెప్పుకోదగిన మంచి మార్చులు
పీవీ హయాంలో ‘భారతదేశంలో జరిగిన ఆర్ధిక సరళీకరణయువతరానికి దేశవిదేశాలలో మంచి ఉద్యోగావకాశాలను కలిగించింది. ఆయన
ప్రవేశపెట్టిన ఆర్థికక్రమశిక్షణాత్మక మార్పుల కారణంగా మన దేశపు ఆర్థిక వ్యవస్థప్రమాదకర పరిస్థితినుండి బయటపడితిరిగి గాడిలో పడింది.
ఉదాహరణకు “1997-92లో కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో పెట్టుబడుల ఉపసంహరణద్వారాఆయన సుమారు రూ.2500 కోట్లు సేకరించగలిగాడు. (తరువాత ఆ ప్రక్రియ
వాజపాయి కాలంలోను (1999-2004), యూపీఏ హయాంలోనూ (2004-14) (అలా చేయలేదంటూ
ప్రస్తుతం బుకాయిస్తూన్నా), నేటి మోదీ హయాంలోనూ కొనసాగుతూనే ఉంది!
ఇప్పుడైతే ప్రతీ పరిశ్రమ పనితీరు లాభావకాశాల దృష్ట్యా, నిలదొక్కుకోగలగడం దృష్ట్యా క్షుణ్ణంగా
పరిశీలింపబడుతోంది; దానికి తగిన నిర్ణయం తీసుకోబడుతోంది.
చాలామందికి తెలియని మరొక విశేషం ఉంది –
అదే పీవీ ‘అణుపాటవ పరీక్షల విషయమై తీసుకున్న
ప్రత్యేక శ్రద్ధ. దానికారణంగానే 1995లో జరిపిన
పోఖ్రాన్ అణుపాటవపరీక్ష విజయవంతమైంది. తాను పీవీ తరువాత ప్రధానిగా పదవి చేపట్టిన
రోజుల్లో వాజపాయి అన్నమాట – పీవీ బాంబు సిద్ధమైందన్నారు. నేను కేవలం దానిని
పేల్చానంతే.”
పీవీ పరిపాలనలోని లోటు-పాట్లు
(అ) ఆయన పరిపాలనాకాలమంతా కుంభకోణాలతో
మార్మోగిపోయింది! వాటిలో కొన్ని –
1) స్టాక్‌మార్కెట్ కుంభకోణం – దాని
విలువ సుమారు 5,000 కోట్లు. హర్షద్ మెహతా అనే స్టాక్
బ్రోకర్ దానికి
సూత్రధారి.అతగాడు దాంట్లోకి పీవీ పేరును కూడా ఇరికించడానికి ప్రయత్నించాడు.
ఆరోజుల్లో ఆ కుంభకోణం అతి పెద్దదిగా
పరిగణించబడింది. దొంగ బ్యాంకు రసీదులను, స్టాంపు
కాగితాలను
వాడుతూ చాలా పకడ్బందీగా ఆ కుంభకోణం
నిర్వహించబడింది. దానితో అకస్మాత్తుగా మొత్తం స్టాక్ మార్కెట్
కుప్పకూలింది. అది స్టాక్ ఎక్స్చేంజ్
వ్యవస్థనే గట్టిదెబ్బ కొట్టడంతో వేలాది మదుపరుల కుటుంబాలు
చావుదెబ్బతిన్నాయి.
2) జైన్ సోదరుల హవాలా కుంభకోణం – ఆ
కుంభకోణాన్నే ‘జైన్ డైరీల వ్యవహారం”, ‘హవాలా కుంభకోణం‘ అని కూడా అనేవారు. అది ఒక రాజకీయ,
ఆర్థిక కుంభకోణం. నల్లధనాన్ని నలుగురు సోదరులైన
జైన్ హవాలా బ్రోకర్లు జరిపిన కుంభకోణం. 18 మిలియన్ డాలర్ల
లంచాలకు సంబంధించిన వ్యవహారం ఆ కుంభకోణంలో నడిచింది. అందులో చాలామంది రాజకీయ
పెద్దమనుషులకుప్రమేయం ఉందని
అభియోగం.
3) ‘సెయింట్ కిట్స్ కుంభకోణం – మాజీ
ప్రధాని వీపీ సింగ్ కొడుకైన శ్రీ అజేయ సింగ్ 1989లో ‘సెయింట్ కిట్‘ అనే చోట ఉన్న ఫస్ట్ ట్రస్ట్ కార్పొరేషన్ బేంక్‘లో ఖాతా తెరిచి, 2 మిలియన్ డాలర్లను అందులో జమచేశాడని
చూపించడం కోసం కొన్ని పత్రాలపై దొంగ
సంతకాలను పెట్టారని ఆయన మంత్రివర్గంలో ఒకడైన కేకే తివారీ,
చంద్రస్వామి, కే అగర్వాల్ అనే వ్యక్తులపైన అభియోగం మోపబడింది. (దాని వెనుక దురుద్దేశం
— వీపీ సింగ్‌ను అప్రతిష్ట పాలుచేయడం.)
పీవీ పదవి 1996లో పూర్తయినప్పుడు సీబీఐ ఈ అభియోగాన్ని ఆయనపైన కూడామోపింది. కానీ, సరైన ఆధారాలు లేక ఆ అభియోగం ఋజువు
కాలేదు. పీవీ నిర్దోషిగా బయటపడ్డారు.
4) వోటుకు రొక్కంకుంభకోణం – 1993లో లోక్‌సభలో అవిశ్వాసతీర్మానం
కారణంగా పీవీ తన ఆధిక్యాన్ని ఋజువు చేసుకోవాల్సిన సందర్భం ఒకటి ఏర్పడగా, ఆయనకు 269 సభ్యుల మద్దతు కావలసివచ్చింది.
(కాంగ్రెస్ బలం అప్పుడు 244మాత్రమే) అయితే మొత్తం 269 మంది ఆయనకు మద్దతు ఇచ్చినట్లుగా వోటింగ్ ఫలితం చూపించింది. అవిశ్వాసతీర్మానం వీగిపోయింది. (అందులో 4గురు జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు, 4గురు అజిత్ సింగ్ వర్గపు జనతాదళ్ వాళ్ళు అవిశ్వాసతీర్మానానికి
వ్యతిరేకంగా వోట్లేశారు; ములాయం వర్గం ముగ్గురు, చంద్రశేఖర్ వర్గం ముగ్గురు, బహుజన సమాజ్
పార్టీ వాళ్ళు ముగ్గురు వోటింగులో పాల్గొనలేదు.) 4గురు జార్ఖండ్
ముక్తి మోర్చా వాళ్ళకు ముడుపులు
ముట్టాయనే అభియోగం వచ్చింది. దానితో ఆయన ఈ కేసులో
నిందితుడయాడు. (ప్రధాని పదవిలో ఉండగా
నిందితుడైన వ్యక్తి ఈయన ఒక్కడేనట) అయితే, ఉన్నత
న్యాయస్థానాలు తరువాత ఆ కేసును కొట్టివేసాయి.
5) టెలికామ్ కుంభకోణం – అందులో పీవీ
మంత్రివర్గంలోని సుఖ్రామ్ అనే టెలికామ్ మంత్రి 20,000 కోట్ల ఖరీదు చేసే సరుకు కొనుగోలు సందర్భంలో టెలికామ్
డిపార్టుమెంటుకు ౩.5 లక్షల కండక్టర్ కిలోమీటర్ల పోలిథీన్
ఇన్సులేటెడ్ జెల్లీ ఫీల్డ్‌ను సరఫరా చేసేందుకు ‘హర్యానా టెలికామ్ లిమిటెడ్‘ అనే ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం
విషయమై కుంభకోణం చేసి, దోషిగా నిరూపించబడ్డాడు.
6) స్టాంపు కాగితాల కుంభకోణం – ఆ కుంభకోణానికి
ప్రధానసూత్రధారి కర్ణాటకకు చెందిన అబ్దుల్ కరీమ్ తెల్గీ. తాను స్వయంగానకిలీ స్టాంపు కాగితాలను ముద్రించడమే గాక, స్టాంపు కాగితాలకు కృత్రిమ కొరతను కూడా
సృష్టించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యవహారం
దాదాపు 1990 దశకమంతా నడిచింది. అయితే, 1996-2003లో అతడు ఇచ్చిన ఆదాయపు పన్ను రిటర్న్ లో కొన్ని అవకతవకలు జరిగి,
అతడి కార్యకలాపాలపైన ఆ సంస్థకు అనుమానం కలిగి,
వాళ్ళు లోతుగా శోదించగా, 1996-97 సంవత్సరంలోనే అతడి మొత్తం ఆదాయం 4 కోట్లుగాను,
అందులో లెక్క చెప్పనిది 2 కోట్లుగాను బయటపడింది! ఎట్టకేలకు అతడిని 2007లో దోషిగా నిర్ధారించి,
సుమారు 200 కోట్లు అపరాధరుసుముగా తీసుకున్నారు.
30 సంవత్సరాల కారాగార వాసాన్ని కూడా
నిర్ణయించారు. (ఒక వ్యక్తి ఆదాయం
విషయంలో అంత మొత్తం దొరకడం బహుశః మొదటిసారి అని ఆ రోజుల్లో అనుకునేవారు.)
ఇక్కడ ఒక మాట: 1947లోనే గాంధీజీ “భారతీయ జాతీయ కాంగ్రెసును స్థాపించినందుకు రావలసిన
ఫలితమైన స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి,
ఇక ఈ పార్టీని రద్దుచేయడం సమంజసం” అన్నాడని మనం
ఎన్నోచోట్లఎంతమంది దగ్గరనో విన్నాం కదా! అయితే ఆయన అనుచరులు ఆ విధంగా ఎందుకు
చేయలేదంటే
– “ఈ స్వాతంత్ర్యపు ఫలాలను
ఇబ్బడిముబ్బడిగా తామే పొందాలనే ఉద్దేశంతోనే అందులోని ఎందరో
నాయకులు దానిని మూసివేయకుండా
కొనసాగించా”రని ఆ రోజుల్లోనే ఎందరో అనుకునేవారట!
ఈ విషయమై మనం కూడా పునరాలోచన చేస్తే,
గాంధీ ఆనాడు అన్నది పరమసత్యమనీ, “ఆపాతకాలం నాటి నాయకులు మొదలు నేటి
కాంగ్రెసు నాయకులవరకూ వేసిన ఎత్తులూ, పైయెత్తులూ,నిస్సిగ్గుగా పార్టీ కండువాలు మార్చేసుకోవడాలూ వగైరా వాళ్ళ
స్వార్ధచింతనలకు పరాకాష్ట అనీ తేటతెల్లమౌతోంది కదా. అందులో దేశభక్తి దేశసేవ,
అంకితభావం మొదలైనవి కలికానికి కూడా కానరావట్లేదని
వేరే చెప్పాలా? ఆ పార్టీనుండి పుట్టిన వందలాది పిల్ల
కాంగ్రెసు పార్టీలు, ఇతర ప్రాంతీయ పార్టీలు వికృతక్రీడలో ‘ఈ తల్లిపార్టీనే మించిపోవడం” కూడా మన కళ్ళెదుటే జరుగుతోంది కదా.
(ఆ) పీవీ పరిపాలన
కూడా హిందువులకు ఇబ్బంది కలిగిస్తూ, ముస్లిములకు
మేలుచేసే విధంగా ఉండడం
(అది భవిష్యత్తులో ఎన్నో ప్రమాదాలకు దారితీయబోతోందనే
నిజాన్ని ఆ రోజుల్లో చాలామంది గ్రహించలేకపోయారు)
(1) బాబ్రీమసీదు.
విధ్వంసానికి (1992 డిసెంబర్) ఎంతో ముందే “మతవిద్వేషాలను
అరికట్టడానికి, తొలగించడానికీ, తద్వారా దేశంలో పరస్పర మతసామరస్యం నెలకొల్పడానికీ” అనే నెపంతో
(అప్పటికే వివాదంలో ఉన్న రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థలం ఒక్కదానికి మాత్రమేమినహాయింపుతో) పీవీ మంత్రివర్గం “1991 ప్రార్ధనా స్థలాల చట్టాన్ని తీసుకువచ్చింది.
ఆ చట్టాన్ననుసరించి, 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ఏ ప్రార్ధనాస్థలమైనా దాని
‘‘యథాస్థితిలో మాత్రమే’’ ఉంచబడాలి. దానికి సంబంధించిన (గతచరిత్రకు సంబంధించిన) ఏ
మతసంబంధమైన వ్యాజ్యాలూ చెల్లనేరవు. (కచ్చితంగా ఇది మైనారిటీ సంతుష్టీకరణేఅని అర్థమౌతూనే ఉంది కదా. ఎందుకంటే ఆ చట్టం చేసిన నాటికే మధురలోని శ్రీకృష్ణజన్మస్థానానికి
సంబంధించిన వివాదం,వారణాసిలో గతంలో ఔరంగజేబు కాశీలో ఉండిన
శివాలయాన్ని కూలగొట్టించి కట్టించిన జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతూ ఉన్నాయి;
ఈ చట్టం ప్రకారం ఎవరూ ఆ వివాదాల మాటఎత్తకూడదు.)
(2) 1954లో నెహ్రూ వక్ఫ్ బోర్డు స్థాపించారు. 1964లో అది వక్ఫ్ కౌన్సిల్‌గా పరిణమించింది. పీవీ పరిపాలనలో మరొక అడుగు
ముందుకు పడి, 1995 నవంబర్ 22న “వక్ఫ్ చట్టం 1995” వచ్చింది.దానితో ముస్లిమ్ లా బోర్డుకు మరిన్ని
అధికారాలు సంక్రమించాయి. అంటే అదంతా ముస్లిములకు మాత్రమే ప్రయోజనకారి అయింది.
(అంతకుముందు 1978నుండి కేవలం ఒక “ముస్లిమ్ మైనారిటీ కమీషన్” మాత్రమే
ఉండేది.)
చిత్రమేమిటంటే టర్కీ, ఈజిప్టు, జోర్డాన్ వంటి ఎన్నో ముస్లిమ్
దేశాలలో ఇటువంటి వక్స్ బోర్డులే లేవు. అది అలా ఉండగా ఈ వక్ఫ్ బోర్డు మన దేశంలో భారీగా స్థలాలున్న సంస్థలలో
మూడవది.
(మైనారిటీలపైన, ముఖ్యంగా ముస్లిములపైన చూపించిన ఆ అతిప్రేమ వలన చోటుచేసుకున్న
‘ఆసక్తికరమైన పరిణామాలు” కొన్ని –
n బెంగళూరులోని ఈద్గా గ్రౌండ్స్‌లో కొంత భాగం తమకే చెందుతుందంటూ,
అలాగే సూరత్
మునిసిపాలిటీ భవనం తమదే అనీ ముస్లిం లా
బోర్డు ఏకపక్షంగా ప్రకటించింది
n 2021లో గుజరాత్ లోని బేట్ ద్వారకలో (శ్రీకృష్ణుడికి చెందిన ప్రాంతం)
ఉన్న 8 ద్వీపాలలో
రెండు తమకే చెందుతాయని సున్నీ వక్ఫ్
బోర్డు ప్రకటించగా, అక్కడి హైకోర్టు “శ్రీకృష్ణుడికి
చెందిన
నగరంలోని భాగం ఈ వక్ఫ్ బోర్డుకు ఏ
కారణంగా చెందుతుంది?” అంటూ విస్మయాన్ని ప్రకటించింది.
n ఈమధ్యనే తమిళనాడులో కూడా
ఇటువంటి సంఘటనే మరొకటి జరిగింది. సేలం పట్టణంలో ఒక
ప్రాంతంలో ఉన్న శ్మశానభూమిని వక్ఫ్‌బోర్డుకు
బదలాయించాలని సేలం ముస్లిం శ్మశాన భూమి పరిరక్షణ సమితి” అనే సంస్థ ఒక
న్యాయస్థానంలో దావా వేసింది. దానిని మొదట హైకోర్టు, ఆపైన సుప్రీంకోర్టు తిరస్కరించాయి. (2023 మే). ఆ తీర్పులో కేవలం ఆ బోర్డు ఆ విధంగా కేవలం ఒక ప్రకటన ద్వారా
తమదిగా ప్రకటించడంతో ఆ ఆస్తి ఆ బోర్డు స్వంతం కాబోదనీ అది సరైన పద్ధతి కాదనీ,రెండు సర్వేలు చేసి, తగాదాను అధ్యయనంచేసి, అప్పుడు ఆ రాష్ట్రప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకూ నివేదిక సమర్పించడమే సరైన పద్ధతి అనీ స్పష్టం చేశాయి.
(ఇ) పీవీ తన పార్టీ సభ్యులను,
చట్టసభల ప్రతినిధులను తన అదుపులో ఉంచుకోలేకపోవడం
పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా
కొనసాగడం బొత్తిగా ఇష్టంలేని కొందరు అసమ్మతి నాయకులు” శాయశక్తులా
ఆయనకు ‘సహాయనిరాకరణ‘ చేస్తూ వచ్చారు. (తమిళ మానిల కాంగ్రెస్
వంటి ‘కాంగ్రెస్ తల, వేరే తోకలు’ పెట్టుకున్న కొందరు
నాయకులు ఆ రోజుల్లోనే తయారయారు) దానికి తోడు ఆ పార్టీ అధినాయకి శ్రీమతి
సోనియా గాంధీకి కూడా ఆయనంటే ఇష్టంలేదు.
(అదే కారణంవల్ల కావచ్చు – ఆ పార్టీకి ఎంతగానో సేవలు
చేసిన పీవీ చనిపోయినప్పుడు ఆయన శవాన్ని
ఢిల్లీలోని కాంగ్రెసు కార్యాలయంలోకి తీసుకువెళ్ళడానికి
అనుమతి లభించలేదు)
11వ లోకసభ ఎన్నికల ఫలితాలు – 1996
మొత్తం సీట్లు 529 | భాజపా 161 | కాంగ్రెస్ 140 | జనతాదళ్ 046 | సిపిఐ(ఎం) 032 | ఇతరులు 150 |
ఈసారి కూడా ఏ పార్టీకీ సగం సీట్ల
ఆధిక్యమైనా రాలేదు. వేర్వేరు ఏర్పాట్లతో ముగ్గురు ప్రధానులు ప్రభుత్వాలను నడిపారు గానీ, ఏదీ ఎక్కువరోజులు నిలవలేకపోయింది.
(వాజపాయి, దేవెగౌడ, ఐకే గుజ్రాల్
ప్రభుత్వాల పాట్ల తర్వాత వాజపాయి నిలదొక్కుకున్న తీరును తరువాతి భాగంలో చూద్దాం)