గాజా లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ ఇజ్రాయెల్, తన రఫా ఆపరేషన్ కొనసాగిస్తోంది. తాజాగా గాజా వైపున ఉన్న రఫా సరిహద్దు క్రాసింగ్ ను తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ అధికారికంగా ప్రకటించింది.
సోమవారం రాత్రి నుంచి తూర్పు రఫాలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఇందులో 20 మంది హమాస్ మిలిటెంట్లు మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. రఫా క్రాసింగ్ వద్ద ఇజ్రాయెల్ జెండా ఎగురుతున్న దృశ్యాలను కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో సేవలు నిలిచిపోయాయని పాలస్తీనా క్రాసింగ్స్ అథారిటీ ప్రతినిధి వేల్ అబు ఒమర్ తెలిపారు. నిరంతరం బాంబులు పడుతుండటంతో ఇక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చిందన్నారు.
గాజా, ఈజిప్టు సరిహద్దుల్లో రఫా క్రాసింగ్ ఉంటుంది. గతేడాది గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఈజిప్టు దీనిని మూసివేసింది. అంతర్జాతీయంగా వచ్చిన అభ్యర్థనలతో మానవతా సాయం అందించేందుకు దీనిని తెరిచారు. గాజాలో చిక్కుకున్నఅనేక మంది పాలస్తీనా వాసులు, ఇతర విదేశీయులు కూడా ఈ మార్గం నుంచి గాజాను వీడారు.