Modi appeals to Indian Muslims to think about future of their
children
భారతీయ ముస్లిములు స్వయంసమృద్ధం కావాలనీ, తమ
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలనీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి
చేసారు.
ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ముఖాముఖీలో ప్రధాని
మోదీ ‘‘నేనీ విషయం మొదటిసారి మాట్లాడుతున్నాను. నేను ముస్లిం సమాజానికి
చెబుతున్నాను. దయచేసి స్వయంసమృద్ధులు కండి’’ అని చెప్పారు.
ప్రధాని ఇంకా ఇలా అన్నారు. ‘‘ఈ విషయం గురించి
ఆలోచించండి. దేశం వేగంగా పురోగతి చెందుతోంది. ఆ ప్రగతిని ముస్లిములు ఎందుకు అందుకోలేకపోతున్నారు?
కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధి మీకు ఎందుకు అందలేదు? కాంగ్రెస్ హయాంలో
మీరు ఆ విషయంలో బాధితులే కదా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. దాన్నిబట్టి
నిర్ణయం తీసుకోండి’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
ప్రధాని ఇంకా మాట్లాడుతూ భారతీయ ముస్లిములను
ఉద్దేశించి ఇలా చెప్పారు. ‘‘ఒకళ్ళను గద్దెనెక్కించి మరొకరిని దింపేసే ప్రయత్నాల్లో
మీరు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం
మారుతోంది. దాన్ని గమనించండి’’ అని హితవు పలికారు.
‘‘నేను గల్ఫ్ దేశాలకు వెళ్ళినప్పుడు భారత
ప్రధానిగానే కాక ఒక వ్యక్తిగా కూడా నన్ను గౌరవిస్తారు. సౌదీ అరేబియా అధికారిక విద్యావిధానంలో
యోగా అంతర్భాగం. అదేగానీ నేను భారతదేశంలో యోగా గురించి మాట్లాడితే దాన్ని ముస్లిం
వ్యతిరేకంగా మీరు భావిస్తారు. గల్ఫ్ దేశాల్లో గొప్పగొప్ప వారిని నేను కలుస్తూ
ఉంటాను. భోజన సమయంలో వారు నన్ను ఎప్పుడూ యోగా గురించి అడుగుతారు. ఏదైనా ఒక రకం
యోగా గురించి అధికారిక శిక్షణా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. కొందరైతే,
వారి భార్యలు యోగా నేర్చుకోవడం కోసం భారత్ వచ్చి కొన్ని నెలలు ఇక్కడ ఉంటారని చెబుతుంటారు.
ఇక్కడ నేను గల్ఫ్ దేశాల పాలకుల కుటుంబసభ్యులు, లేదా వారి భార్యల గురించి చెబుతున్నాను.
కానీ మనదేశంలో యోగా అనేది హిందూ-ముస్లిం చర్చకు తగ్గించబడింది. అలా చేస్తున్న
ముస్లిములను నేను అభ్యర్ధిస్తున్నాను. దయచేసి మీరు మీ, ఇంకా మీ పిల్లల భవిష్యత్తు
గురించి ఆలోచించండి’’ అని చెప్పారు.
‘‘ఏ సామాజికవర్గమైనా సరే, ఎవరో వారిని భయపెట్టే
ప్రయత్నం చేస్తున్నారని వారికి కట్టుబానిసల్లా ఉండకూడదు. ఇంకో విషయం, చాలామంది
ముస్లిములు బీజేపీ అంటే భయపడతారు. వాళ్ళకి నేను ఒకటే చెబుతున్నాను. వెళ్ళి ఒక
యాభైమంది బీజేపీ కార్యకర్తల దగ్గర కూర్చోండి. వాళ్ళు మిమ్మల్ని అక్కణ్ణుంచి
తరిమేస్తారా? మీరే ప్రయత్నించి స్వయంగా తెలుసుకోండి. మీరు బీజేపీ ప్రధాన
కార్యాలయానికి వెళ్ళండి మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు’’ అని మోదీ వివరించారు.