Rahul
wanted to overturn Ram Mandir Verdict, says Pramod Krishnam
రామజన్మభూమి కేసులో
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆ తీర్పును మార్చివేయాలని రాహుల్ గాంధీ
కోరుకున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రామమందిరం గురించి సుప్రీంకోర్టు
ఇచ్చిన తీర్పును తిరగతోడి మార్పిస్తుందని రాహుల్ తమ పార్టీ వర్గాలకు చెప్పారట.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి
బహిష్కృతుడైన నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ ఆ విషయాన్ని వెల్లడించారు. ‘‘నేను
కాంగ్రెస్ పార్టీలో 32 సంవత్సరాలకు పైగా ఉన్నాను. రామమందిరం తీర్పు వచ్చినప్పుడు
రాహుల్ గాంధీ తన ఆంతరంగికులతో సమావేశంలో ఉన్నారు. అప్పుడాయన మాట్లాడుతూ కాంగ్రెస్
అధికారంలోకి రాగానే ఒక ప్రత్యేకమైన కమిషన్‌ను నియమించి రామమందిరం నిర్ణయాన్ని మార్చివేస్తామన్నారు.
షాబానో కేసు తీర్పును రాజీవ్ గాంధీ మార్చివేసినట్టే రామమందిరం కేసు తీర్పును కూడా
మార్చివేస్తామని రాహుల్ చెప్పారు’’ అని వివరించారు.
ఈ యేడాది జనవరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనలేదు. అప్పటినుంచీ ఆచార్య
ప్రమోద్ కృష్ణమ్ తమ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దాంతో ఫిబ్రవరి
నెలలో ఆయనను కాంగ్రెస్‌నుంచి బహిష్కరించారు.
ఇటీవలి కాలంలో పలువురు కాంగ్రెస్ నాయకులు రామమందిరం
విషయంలో పార్టీ నాయకత్వం నుంచి తాము ఎదుర్కొన్న సమస్యలను వెల్లడిస్తున్నారు.
తాజాగా మే 5న రాధికా ఖేరా అనే నాయకురాలు అదే విషయంలో పార్టీకి రాజీనామా చేసారు. ఏఐసీసీకి
రాసిన లేఖలో ఆమె, తనకు పార్టీలో జరిగిన అన్యాయం గురించి వివరించారు. కొద్దికాలం
క్రితం ఆమె అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. దాంతో ఆమెతో పార్టీ సహచరులే దుర్మార్గంగా
వ్యవహరించారు. ఆమెను గదిలో నిర్బంధించి, పార్టీ సమావేశాల్లో పాల్గొనకుండా చేసారు.
ఏఐసీసీకి రాసిన లేఖలో వాటి గురించి వివరిస్తూ రాధిక ‘‘ప్రాచీనకాలం నుంచీ ధర్మానికి
కట్టుబడి ఉన్నవారిని వ్యతిరేకించడం ఆనవాయితీగా వస్తోంది. హిరణ్యకశిపుడు
కానివ్వండి, రావణాసురుడు కానివ్వండి లేదా కంసుడు కానివ్వండి… వారందరూ దానికి
ఉదాహరణలే. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది, భగవాన్ శ్రీరాముడి పేరును తలచుకునేవారిని
వ్యతిరేకిస్తున్నారు. శ్రీరామచంద్రప్రభువు జన్మస్థానం అంటే ప్రతీ హిందువుకూ ఎంతో
పవిత్రమైన స్థలం. రామచంద్రుణ్ణి దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైనట్లే అని ప్రతీ
హిందువూ భావిస్తారు. కానీ కొందరు దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు’’ అని రాసుకొచ్చారు.
అంతకు కొన్నాళ్ళ ముందు, ఏప్రిల్ 4న గౌరవ్ వల్లభ్
కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసారు. ఆ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున
ఖర్గేకు రాసిన లేఖలో గౌరవ్ వల్లభ్ ‘‘ఇప్పుడు కాంగ్రెస్ ఒక దశా దిశా లేకుండా
పయనిస్తున్న తీరుతో నేను సౌకర్యంగా ఉండలేకపోతున్నాను. నేను సనాతనధర్మానికి
వ్యతిరేకంగా నినాదాలు చేయలేను. ఈ దేశానికి సంపద సృష్టిస్తున్నవాళ్ళను దూషించలేను.
కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికీ, పార్టీలో నాకు ఇచ్చిన అన్ని పదవులకూ రాజీనామా
చేస్తున్నాను’’ అని స్పష్టం చేసారు. రామమందిర ప్రాణప్రతిష్ఠకు కాంగ్రెస్ దూరంగా
ఉండిపోవడం ‘పాపం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి
పార్టీకి ఆహ్వానం వచ్చింది. దాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. ఆ విషయాన్ని నేను
ఒప్పుకోలేను. కూటమి నాయకులు సనాతన ధర్మం మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ విషయంలో
కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదు? నేనిప్పుడు బీజేపీలో చేరుతున్నాను. భారతదేశాన్ని
ముందుకు తీసుకువెళ్ళడంలో నా సామర్థ్యాన్నీ, జ్ఞానాన్నీ సమర్థంగా వినియోగించాలని ఆశిస్తున్నాను’’
అంటూ గౌరవ్ వల్లభ్ రాసుకొచ్చారు. తాను నికార్సైన హిందువుని అని చెప్పుకుంటూ అయోధ్య
రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగిన మూడు నెలలకైనా ఆ మందిరాన్ని దర్శించుకోనందుకు రాహుల్
గాంధీని ఆయన విమర్శించారు.