Gujarat to vote in third phase polling
లోక్‌సభ ఎన్నికల మూడో దశలో అన్ని
నియోజకవర్గాల్లోనూ పోలింగ్ జరిగే ఒకేఒక పెద్దరాష్ట్రం గుజరాత్. భారతీయ జనతా పార్టీ
కంచుకోటగా నిలుస్తున్న ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోడానికి చేసే
ప్రయత్నాలు ఫలిస్తాయా? ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుపెట్టగలుగుతుందా?
గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 26 లోక్‌సభా
స్థానాలున్నాయి. అయితే సూరత్‌లో బీజేపీ అభ్యర్ధి ఒక్కరే బరిలో మిగలడంతో అక్కడ
ఏకగ్రీవం అయిపోయింది. ఎన్నిక జరక్కముందే బీజేపీ ఖాతాలో ఒక సీటు చేరిపోయింది. మిగతా
25 నియోజకవర్గాలకు పోలింగ్ రేపు అంటే మే 7న జరుగుతుంది.
గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఘనవిజయాలు
అందుకున్న గుజరాత్‌లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ప్రధానమంత్రి
నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ గుజరాతీలే కావడంతో ఆ పార్టీలో ఉత్సాహం
ఘనంగానే ఉంది. 2022లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సైతం కమలదళం జయకేతనం ఎగురవేసింది. ‘గుజరాతీ
అస్మిత’ (ఆత్మగౌరవం) ఆ పార్టీ శ్రేణుల రణన్నినాదంగా ఉంది. మరోవైపు కాంగ్రెస్
పార్టీ కూడా ఆశలు కోల్పోలేదు. సుదీర్ఘకాలంగా ఒకేపార్టీ నాయకత్వం వల్ల రాష్ట్ర ఓటర్లలో
ఉదాసీనత నెలకొందనీ, అదే తమ పార్టీని గెలుపు వైపు నడిపిస్తుందనీ అంచనా వేస్తోంది.
రాష్ట్రంలోని క్షత్రియులు బీజేపీ పట్ల నిరాశతో ఉన్నారని కాంగ్రెస్ లెక్కలు
కడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో తమ పొత్తు కూడా లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.
2022లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా
పార్టీ గతంలో కంటె 57 సీట్లు ఎక్కువ సాధించి, రికార్డు స్థాయిలో 156 సీట్లు
గెలుచుకుంది. కాంగ్రెస్ ఏకంగా 60 సీట్లు
కోల్పోయి 17 సీట్లకు పరిమితమైంది. 2017 ఎన్నికల కంటె 2022లో కాంగ్రెస్ పార్టీ
ఏకంగా 14.2శాతం ఓట్లను కోల్పోయి 27.3శాతానికి పరిమితమైంది. మరోవైపు ఆమ్ ఆద్మీ
పార్టీ 5 సీట్లు గెలుచుకోగలిగింది.
లోక్‌సభా స్థానాల విషయానికి వస్తే, గుజరాత్‌లో 26
ఎంపీ సీట్లున్నాయి. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ 24 సీట్లు
గెలుచుకుంటే బీజేపీ ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన ప్రతీ
ఎన్నికలోనూ బీజేపీ కాంగ్రెస్ కంటె ఎక్కువ సీట్లు గెలుస్తూనే ఉంది.
1989లో బీజేపీ 12, జనతాదళ్ 11, కాంగ్రెస్ కేవలం 3
స్థానాలు గెలుచుకున్నాయి. 1991లో బీజేపీ ఏకంగా 20 స్థానాలు కైవసం చేసుకుంది. 2004లో
కాంగ్రెస్ 12 సీట్లు దక్కించుకుంటే బీజేపీ 14 స్థానాలు సొంతం చేసుకుంది. 2009లో
కాంగ్రెస్ 11 నియోజకవర్గాల్లో గెలిస్తే బీజేపీ 15 నియోజకవర్గాల్లో జెండా ఎగరేసింది.
ఇక 2014, 2019లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా సంపాదించుకోలేకపోయింది. మొత్తం 26 స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీయే విజయఢంకా మోగించింది.
2019లో గుజరాత్‌లో బీజేపీ
అన్నిస్థానాల్లోనూ 50శాతం కంటె ఎక్కువ ఓట్‌షేర్‌తో గెలుపొందింది. 18
స్థానాల్లోనైతే రెండున్నర లక్షలకు పైగా మెజారిటీతో విజయభేరి మ్రోగించింది. ఈసారి
అన్ని నియోజకవర్గాల్లోనూ కనీసం ఐదు లక్షల ఓట్లతో గెలవాలని ఆ పార్టీ లక్ష్యంగా
పెట్టుకుంది.
కాంగ్రెస్ ఈసారి క్షత్రియుల ఓట్లపై కన్నేసింది.
కేంద్రమంత్రి, బీజేపీ రాజ్‌కోట్ అభ్యర్ధి పర్షోత్తమ్ రూపాలా క్షత్రియుల గురించి
చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో నిరసనలకు దారితీసాయి. రూపాలాను ఎన్నికల బరిలోనుంచి
తప్పించాలంటూ క్షత్రియులు బీజేపీని డిమాండ్ చేసారు కూడా. అయినా బీజేపీ వెనక్కు
తగ్గలేదు. దాంతో వారి ఓట్లను తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. KHAM
వర్గం మొత్తాన్నీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. KHAM అంటే
క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీలు, ముస్లిములు.
2019లో 65శాతం క్షత్రియులు, 66శాతం పటీదార్లు
(పటేల్‌లు) బీజేపీకి ఓటు వేసారు. అయితే పర్షోత్తమ్ వ్యాఖ్యల వివాదం క్షత్రియులు,
పటీదార్ల మధ్య కులపరమైన విభేదాలను మళ్ళీ తెరమీదకు తీసుకొచ్చింది. మరోవైపు, బీజేపీ
ఈసారి 400పైగా సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందనీ,
రిజర్వేషన్లను ఎత్తివేస్తుందనీ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ
వర్గాలను తనవైపు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
2019లో 49శాతం ఎస్సీలు బీజేపీకి మద్దతిస్తే,
కాంగ్రెస్‌కు 44శాతం ఎస్సీలు మద్దతిచ్చారు. అయితే 63శాతం ఎస్టీలు బీజేపీకి
మద్దతిస్తే, కాంగ్రెస్‌కు 31శాతం మంది ఎస్టీలు మాత్రమే అండగా నిలిచారు.
2022 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గణనీయంగా
దెబ్బతీసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీ 18శాతం ఎస్సీలు, 20శాతం ఎస్టీలు, 30శాతం
ముస్లిముల ఓట్లను కొల్లగొట్టింది. తద్వారా కనీసం 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్
విజయావకాశాలను దెబ్బతీసింది. ఇప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తులో ఉంది. కాంగ్రెస్
23 స్థానాల్లో పోటీ చేస్తుంటే ఆప్ 2 సీట్లలో బరిలో ఉంది.
అసంతృప్తి విషయానికి వస్తే అది కాంగ్రెస్, బీజేపీ
రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది. భరూచ్, భావనగర్ స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీకి
కేటాయించడం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇష్టం లేదు. ప్రత్యేకించి, దివంగత నేత అహ్మద్
పటేల్ కుటుంబం ఆ నియోజకవర్గాలను ఆప్‌కు వదిలేసుకోవడంపై అసంతృప్తితో ఉన్నాయి.
బీజేపీలో కూడా వడోదర, సబర్‌కాంత స్థానాల్లో అభ్యర్ధులు అసంతృప్తితో ఉన్నారు. వారి
అభ్యర్ధిత్వాలపై పార్టీలోనే వ్యతిరేక గళాలు వినిపిస్తుండడంతో వారిలో నిరాసక్తత
కలగజేసింది.
అలా అని బీజేపీని ఓడించడం అంత సులువేమీ కాదు. ఆ పార్టీకి
కాంగ్రెస్ కంటె సగటున 30శాతం కంటె ఎక్కువ ఓటుశాతం ఉంది. అంత భారీ మొగ్గు సాధించి
కమలదళాన్ని ఓడించడం మాటలు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఐదుశాతం వరకూ
ఓట్లను కోల్పోయినా ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ గెలవగలదు. కాంగ్రెస్-ఆప్ ద్వయం
కనీసం రెండు సీట్లను గెలవాలంటే బీజేపీ ఓట్లలో 7.5శాతానికి పైగా కోత పడాలి.
అయితే, గుజరాతీలు తమ ‘అస్మిత’ను
అంత సులువుగా వదులుకుంటారా? తమ మాజీ ముఖ్యమంత్రి వరుసగా రెండుసార్లు ప్రధానమంత్రి
అయారు, మూడోసారి బరిలో ఉన్నారు. ఇక దేశంలో టాప్-2 పొజిషన్‌లో ఉన్నది కూడా తమ
రాష్ట్రానికి చెందిన నాయకుడే. అలాంటి అవకాశాన్ని గుజరాతీలు మూడోసారి వదులుకుంటారా?
వేరే పార్టీలకు అవకాశం కల్పిస్తారా? అంటే అనుమానమే.