ఏపీకి కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఈసీ ఆదేశించింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ ఆదివారం వేటు వేసిన సంగతి తెలిసిందే.
రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు వేయడంతో ముగ్గురు పేర్లతో ప్యానెల్‌ను ఏపీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను ప్యానెల్లో పంపారు. వీరిలో హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు.