Our Prime Ministers, Their Leadership and
Administration Skills – Special Series – Part 6
******************************************************************
సత్యరామప్రసాద్ కల్లూరిరచన : మన
ప్రధానమంత్రులు
******************************************************************
రాజీవ్ రతన్ గాంధీ
(20-08-1944 : 21-05-1991)
******************************************************************
రాజీవ్‌గాంధీ ఇందిరాగాంధీ మొదటి కొడుకు. మొదట్లో
అతనొక కమర్షియల్ పైలట్. ఇటలీ దేశస్తురాలైన సోనియాగాంధీని (అసలుపేరు ఎడ్విగే
ఆంటోనియా ఆల్బినా మైనో) ప్రేమించి 1968లో పెళ్ళి చేసుకున్నాడు. (అయితే ఆమె తమ
వివాహం అయిన 15ఏళ్ళ వరకూ భారతదేశ పౌరసత్వాన్ని స్వీకరించలేదు. కారణాలు
సాంకేతికమైనవో లేక ఆమె ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదో.) రాజీవ్ తమ్ముడైన
సంజయ్ గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఇందిర ఈయనను తన వారసుడిగా పైకి తీసుకురావడానికి
ప్రయత్నించింది. అయితే ఆమె బ్రతికి ఉన్నంతకాలమూ రాజీవ్ ఒక కార్యకర్తగా మాత్రమే
కాంగ్రెస్‌కు పనిచేసాడు. ఆమె మంత్రివర్గంలో ఏ పదవీ చేపట్టలేదు.
1984 అక్టోబర్ 31 ఉదయం శ్రీమతి ఇందిరాగాంధీ మరణించినప్పుడు
రాజీవ్ గాంధీ పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉండడంతో అతను వచ్చేవరకూ వేచిఉండాలనీ, ఆమె
మరణవార్తను వెంటనే ప్రకటించకూడదనీ కాంగ్రెస్ పెద్దలు నిశ్చయించుకున్నారు.
(ఉన్నవారిలో ఎవరైనా పెద్దను ఆపద్ధర్మ ప్రధానిగా ప్రకటించడం అనే అప్పటివరకూ ఉన్న
సంప్రదాయాన్ని వారు పాటించలేదు.) ప్రపంచ మాధ్యమాలెన్నో ఆమె మరణవార్తను ఆ
మధ్యాహ్నమే ప్రకటించినా, అధికారికంగా మనదేశంలోని మాధ్యమాలేవీ ప్రకటించకుండా,
రాజీవ్ వచ్చేవరకూ ఆగి, ఆ తరువాత ఆమె మరణ వార్తను ప్రకటించి, వెంటనే అతడిని
తాత్కాలిక ప్రధానిగా నియమించిన వార్తను కూడా ప్రసారం చేసాయి.
ఇందిర హత్య జరిగిన వెంటనే ఢిల్లీలోనూ, దాని పరిసర
ప్రాంతాల్లోనూ పెద్దయెత్తున హింసాకాండ చెలరేగింది. దురదృష్టవశాత్తూ దానిపైన రాజీవ్
చాలా దారుణంగా స్పందించాడు, ‘పెద్ద మర్రిచెట్టు కూలిపోతే దానిచుట్టూ ఉన్న నేల
కంపించదా’ అంటూ.
అతిత్వరలోనే అతడు పార్లమెంట్ ఎన్నికలను
ప్రకటించాడు. (ఆరోజుల్లో ‘సానుభూతి’ అనే అంశం అద్భుతాలను సృష్టించేది.) ఆ
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంతకుముందెన్నడూ రానంత ఆధిక్యం లభించింది. (కొన్ని
సాంకేతిక కారణాల వల్ల అప్పుడు పంజాబ్, అస్సాంలలో ఎన్నికలను కొద్దికాలం పాటు వాయిదా
వేసారు.)
8వ లోక్‌సభ ఫలితాలు – 1984
మొత్తం సీట్లు 541 | కాంగ్రెస్ 414 | తెలుగుదేశం 041 | సిపిఐ(ఎం) 022 | ఇతరులు 064 |
ఈ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్‌కు స్వంతంగానే
మూడింట రెండువంతుల ఆధిక్యత వచ్చిన కారణంగా ఆ పార్టీకి తన స్వంత బలంతోనే చట్టాలు
చేసుకోగలిగే వెసులుబాటు మరల కలిగింది.
రాజీవ్ పరిపాలించిన ఐదేళ్ళ పూర్వార్థంలో అతడిని మెచ్చుకున్నవాళ్ళు
అతడిని Mr Clean అంటూ ఒక పరిశుద్ధుడిగా పొగిడారు. కానీ ఆ కీర్తి
అంతా స్వీడిష్ కంపెనీ ‘బోఫోర్స్’తో తుపాకుల కొనుగోలు ఒప్పందం తర్వాత ఆవిరైపోయింది.
అంతేగాక, ప్రజలు ఆశించిన స్థాయిలో ఆయన పరిపాలన చేయలేకపోయాడు. ‘‘రాజీవ్ హయాంలో
భారతదేశపు రాజకీయ సంస్థల పతనం, రకరకాల ఆర్థిక-సామాజిక బృందాల పుట్టుక, పెరుగుదల
ఏకకాలంలో జరిగిపోయాయి. అంతమంది పార్లమెంటు సభ్యుల మద్దతు ఉన్నా రాజీవ్ సమర్ధవంతమైన
ప్రభుత్వాన్ని నడపలేకపోయాడు’’ అని పలువురు విశ్లేషకుల మాట. మరోలా చెప్పాలంటే అతడి ప్రభుత్వం
‘సరైన పరిపాలన, చురుకుదనం లేని నామమాత్రపు ప్రభుత్వం’ మాత్రమే.
రాజీవ్ గాంధీ ప్రభుత్వం పొరపాట్లలో కొన్ని:
(అ) రాజీవ్ గాంధీ మొదట్లో సిక్కుల పట్ల
సామరస్యపూరితమైన, సానుభూతికరమైన దృక్పథంతో ప్రవర్తించినా 1985లో లోంగోవాల్‌తో
చేసుకున్న ఒప్పందాన్ని సమర్ధంగా అమలు చేయలేకపోయాడు. దానితో ఉగ్రవాదుల కార్యకలాపాలు
ఎక్కువైపోయాయి. ఫలితంగా 600తో మొదలైన మరణాల సంఖ్య 1988 నాటికి 3వేలకు చేరుకుంది.
(ఆ) బోఫోర్స్ కుంభకోణం రాజీవ్ రాజకీయ జీవితంలో
మాయని మచ్చగా మిగిలిపోయింది. బోఫోర్స్ ఒప్పందం అనేది 1986లో AB Bofors అనే
స్వీడిష్ కంపెనీతో ‘హోవిట్జర్ తుపాకుల’ కొనుగోలుకు కుదుర్చుకున్న 1.4 బిలియన్
డాలర్ల ఒప్పందం. ఆ ఒప్పందాన్ని కుదిర్చే క్రమంలో కొందరు మధ్యవర్తులు సుష్టుగా కమిషన్లు
అందుకున్నారనేది అభియోగం. వారిలో ‘కత్రోచీ’ అనే ఇటలీ దేశస్తుడు ప్రముఖ వ్యక్తి. ఆ
మధ్యవర్తులకు సుమారు 40 మిలియన్ డాలర్ల వరకూ ముడుపులుగా ముట్టాయనే పుకారు బయటకు
వచ్చింది. (స్వీడన్ దేశపు నేషనల్ ఆడిట్ బ్యూరో కూడా ఆ అభియోగాన్ని పరోక్షంగా
బలపరిచింది.) ఆ కేసు – మన వ్యవస్థల తీరు పుణ్యమా అని – మొన్నమొన్నటివరకూ నత్తనడక
నడుస్తూనే ఉంది.
(ఇ) రాజీవ్ చేసిన మరొక పెద్ద తప్పిదం : తనకు పార్లమెంటులో
ఉన్న విపరీతమైన ఆధిక్యాన్ని ఉపయోగించి, విడాకులు పొందిన ముస్లిం మహిళలకు భరణం
లేకుండా చేసిన ‘1986 ముస్లిం మహిళల చట్టా’న్ని చేయడం.
షాబానో అనే 73ఏళ్ళ స్త్రీ, భర్త తనకు
విడాకులిచ్చి తగిన భరణం ఇవ్వనందుకు, కోర్టుకెక్కింది. సుప్రీంకోర్టు ఆమెకు భరణం
ఇవ్వవలసినదిగా తీర్పు చెప్పింది. అది ముస్లిం మతపెద్దలకు అంగీకారం కాలేదు. దాంతో
‘ఆ మతపెద్దలను సంతృప్తి పరచడం కోసమా’ అన్నట్లు, కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాజీవ్
గాంధీ ఆ చట్టాన్ని తీసుకువచ్చాడు. దానితో అప్పటివరకూ ‘21వ శతాబ్దపు ప్రతినిధి’గా
చెలామణీ అయిన రాజీవ్ ‘అభివృద్ధి నిరోధకుడు’ అనే చెడ్డపేరు తెచ్చుకున్నాడు. దానిని
ఎందరో ‘మతఛాందసాన్ని ప్రోత్సహించే చర్య’గా అభివర్ణించారు.
ఆ చర్య, మరొకపక్క ఊపందుకుంటున్న ‘అయోధ్య
రామమందిరం-బాబ్రీ మసీదు’ వివాదానికి మరింత ఊతమిచ్చింది. దాంతో హిందువులకు కూడా
అనుకూలమైన ఏదైనా ఒక చర్యను చేపట్టడం కోసం అన్నట్లుగా ఆయన 1986 ఫిబ్రవరిలో
హిందూభక్తులకు అనుకూలంగా ఉండేందుకు (అప్పటివరకూ వేసిఉన్న) బాబ్రీమసీదు తాళాలను, రామమందిరపు
విగ్రహాలు దర్శించుకోవడం కోసం తెరిపించవలసిందిగా ఆజ్ఞాపించాడు. (అయితే ఆ చర్య
విశ్వహిందూపరిషద్, ఆర్ఎస్ఎస్ వారికే బాగా అనుకూలించి మరికొన్నాళ్ళకు వివాదాస్పద
కట్టడాన్ని కూల్చే ఘటనకు పరోక్షంగా దోహదపడింది.) రాజీవ్ ప్రభుత్వం 1989 నవంబర్‌లో అదే స్థలంలో శిలాన్యాస పూజను
జరుపుకోవడానికి కూడా అనుమతినిచ్చింది. (ఆ పూజకు రాజీవ్ స్వయంగా వెళ్ళాలని
అనుకొన్నా, చివరి నిమిషంలో అతడి శ్రేయోభిలాషులు వారించడంతో ఆయన ఆ ఆలోచనను
విరమించుకొన్నాడు.)
ఆ విధంగా రాజీవ్ గాంధీ చేసిన ‘హిందూ అనుకూల చర్య’
కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా దానివల్ల వాజపాయి, ఆడ్వాణీల భారతీయ జనతా
పార్టీకే ఎక్కువ ప్రయోజనం కలగడం మొదలైంది.
(ఈ) రాజీవ్ హయాంలో పెద్ద ప్రమాదకర సంఘటన ఒకటి
చోటు చేసుకుంది. అదే భోపాల్ విషవాయు దుర్ఘటన. 1984 డిసెంబర్ 2న భోపాల్‌లోని
యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో మిథైల్ ఐసో సయనైట్ అనే విషవాయువు అనూహ్యంగా బైటకు
వ్యాపించి సుమారు 15వేల మందిని పొట్టన పెట్టుకుంది. దాని కారణంగా 5లక్షల మందికి
పైగా దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యారు.
ఆ కంపెనీ యజమాని, ముఖ్యుడైన ముద్దాయి ‘వారెన్
ఆండర్సన్’ను మొదట అరెస్టు చేసినా, అతడు ఏ శిక్షా అనుభవించకుండానే బైటపడి,
సునాయాసంగా వేరే దేశానికి వెళ్ళిపోగలిగాడు. (తన స్నేహితుడు ఒకరిని అమెరికా
నిర్బంధం నుంచి విడుదలచేయడానికి ప్రత్యుపకారంగా రాజీవ్ గాంధీ ఈ వివాదంలో
కలగజేసుకుని ఆండర్సన్ బైటపడేందుకు సహకరించాడనే అపవాదు ఆ రోజుల్లో వినిపిస్తూ
ఉండేది.)
భోపాల్ దుర్ఘటన బాధితులకు పరిహారం ఇచ్చే ప్రక్రియ
1992 నవంబర్‌లో, అంటే 8 ఏళ్ళ తర్వాత మాత్రమే ప్రారంభమైంది. 2022 జులై నాటికి
సుమారు 6లక్షల మంది బాధితులకు రూ.1550 కోట్ల పరిహారం చెల్లించబడింది. ఆ చెల్లింపులు
ఇంకా జరుగుతూనే ఉన్నాయని మాధ్యమాల ద్వారా తెలుస్తోంది.
(ఉ) రాజీవ్ గాంధీ కూడా తాను నెహ్రూ కుటుంబానికి చెందినవాడిననే
ఆభిజాత్యపు పోకడకు అతీతుడు కాడనే విషయం కూడా ఆరోజుల్లో ఎంతోమంది చెప్పుకున్న
విషయమే. ఒకసారి హైదరాబాద్ విమానాశ్రయంలో ఆయనకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
అంజయ్య చూపిన ‘అసాధారణ విధేయత’ నచ్చక పరుషంగా మాట్లాడడం, అదే ప్రధానాంశంగా
‘ఆంధ్రుల ఆత్మగౌరవం’ ప్రాధాన్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించడం, కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో
దారుణంగా ఓడించడానికి దారితీయడం – ఎందరికో తెలిసిన విషయమే.
అలాగే రాజీవ్ ఒక్కొక్కసారి తన అంచనాల మేరకు తన
సిబ్బంది పనిచేయనప్పుడు వారిపై చాలా అసహనం ప్రదర్శించేవాడని చెప్పడానికి కూడా
అప్పటి వార్తాపత్రికలు కొన్ని నిదర్శనాలు చూపెట్టేవి.
(ఊ) లైసెన్స్ అండ్ పర్మిట్ రాజ్ వ్యవస్థకు వెన్నెముక
అయిన పరిశ్రమల అభివృద్ధి నియంత్రణ చట్టం IDRA రాజీవ్
హయాంలో కూడా అలాగే కొనసాగి, రకరకాల అవినీతి పనులకు దారితీసింది.
(ఋ) సిక్కు సమస్య కారణంగా ప్రాణాలు కోల్పోయిన
తల్లి వలెనే రాజీవ్ కూడా శ్రీలంక తమిళుల వ్యవహారంలో చిక్కుకుని తన ప్రాణాలకే
ముప్పు తెచ్చుకున్నాడు– అప్పటి
శ్రీలంక అధ్యక్షుడైన జయవర్ధనేతో 1987లో భారత్-శ్రీలంక మధ్య చేసుకున్న ఒప్పందం
కారణంగా. ఆ ఒప్పందం ప్రకారం భారతసేన శ్రీలంకలో Indian Peace Keeping Force –
IPKF పేరిట కొంత సైన్యాన్ని కొంతకాలం ఉంచింది. అయితే శ్రీలంకలో 1976 నుంచీ
చురుగ్గా పనిచేస్తూ వచ్చిన LTTE నాయకుడు ప్రభాకరన్ పక్షానికి ఆ ఒప్పందం
అంగీకారయోగ్యం కాలేదు. వారు రాజీవ్ గాంధీపై పగ తీర్చుకునే తరుణం కోసం ఎదురుచూడసాగారు.
అది వాళ్ళకు కాంచీపురం సమీపంలోని శ్రీపెరంబుదూరు వద్ద 1991 మే 21న కాంగ్రెస్
ఎన్నికల సభలో సాధ్యపడింది. (అప్పుడు రాజీవ్ పదవిలో లేడు. లోక్‌సభ ఎన్నికల్లో తమ
పార్టీ అదృష్టాన్ని మరోసారి ప్రయత్నించే పనిలో ఉన్నాడు.) ఆయనను హత్య చేయడానికి తన
నడుముకు బాంబు కట్టుకుని తనను తానే పేల్చివేసుకున్న మానవ బాంబు పేరు కలైవాణి
రాజరత్తినమ్. ఆ బాంబు పేలుడు ప్రభావానికి వారిద్దరితో పాటు మరో 14మంది కూడా
అక్కడికక్కడే మరణించారు.
రాజీవ్ గాంధీ పరిపాలనలోనూ, నిర్ణయాలలోనూ కొన్ని
పొరపాట్లు జరిగినా, ఆయన పాలనాకాలంలో మనదేశం పురోగతిని సాధించడం మొదలైందనీ, ఆయన
కొన్ని పురోభివృద్ధి పనులకు పునాది వేసాడనీ ఆయన ప్రత్యర్ధులు కూడా అంగీకరించక
తప్పదు. ఆయన సకారాత్మకంగా సాధించిన, ప్రారంభించిన కొన్ని అంశాలు:
(1) శాటిలైట్ లింకుల ద్వారా ఎగుమతులకు వీలు
కల్పించిన 1984 నవంబర్ విధాన నిర్ణయం ఎందరో సాఫ్ట్వేర్ రంగ నిపుణులను పారిశ్రామికవేత్తలుగా
గుర్తించడానికి దోహదం చేసింది. వాళ్ళకు కూడా బ్యాంకులనుంచి అప్పు తీసుకునే
వెసులుబాటు కలిగింది. ఆయన పరిపాలనా కాలంలో సమాచారరంగం కూడా ఇతోధికంగా పురోగమించింది.
సాధారణ పౌరులకు ఫోన్ సౌకర్యాలు అందుబాటులోకి రావడం మొదలైంది. వాటన్నిటి వెనుక సామ్
పిట్రోడా అనే సాంకేతిక నిపుణుడి కృషి ఎంతో ఉంది. ఆయనే ‘టెలికామ్ కమిషన్’ను
స్థాపింపజేసాడు.
(2) రాజీవ్ ముందు 35 సంవత్సరాల పాటు చట్టసభలకు
పట్టుకున్న పెద్ద దరిద్రమైన ‘రాజకీయులు తరచుగా పార్టీలు మారడాన్ని’ అరికట్టేందుకు
తెచ్చిన 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘పార్టీ మార్పిడి నిరోధక చట్టం’ రాజీవ్
ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన చర్యే. (ఆ తరువాత కూడా ఆ చట్టంలో మరికొన్ని
ప్రయోజనకరమైన మార్పులు జరిగాయి.)
(3) రాజీవ్‌గాంధీ పరిపాలన రోజుల్లోనే
విద్యారంగానికి కూడా పెద్దపీట వేసారని చెప్పవచ్చు. ఆ వ్యవధిలోనే విద్యకు
సంబంధించిన జాతీయ విధానం National Policy for Education – NPE రూపొందించబడింది.
విద్యావిషయంలో అసమానతలు బాగా తగ్గి విద్యావ్యాప్తికి అవకాశాలు మెండుగా పెరిగాయి.
ఆయన కాలంలోనే ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థాపించారు. అన్నిస్థాయులలోనూ
ఉపాధ్యాయుల వేతనాలు గణనీయంగా పెరిగాయి.
9వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు – 1989
మొత్తం సీట్లు 529 | కాంగ్రెస్ 197 | జనతాదళ్ 143 | బీజేపీ 085 | సిపిఐ (ఎం) 033 | ఇతరులు 071 |
ఈసారి ఏ పార్టీకీ సగం సీట్ల ఆధిక్యం కూడా రాలేదు.
విపి సింగ్, తరువాత చంద్రశేఖర్ ఇతర పార్టీల సహకారంతో జనతాదళ్ ప్రభుత్వాలను ఏర్పరచగలిగారు.
కానీ మొత్తానికి ఆ ప్రభుత్వాలు రెండేళ్ళు కూడా నిలవలేకపోయాయి.
*******************************************************
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (25-06-1931 :
27-11-2008)
*******************************************************
1989
ఎన్నికల ఫలితాలు ఒకరకమైన రాజకీయ అనిశ్చితికి దారితీసిన విధంగా వచ్చాయి. కాంగ్రెస్
అన్ని పార్టీల కంటె సంఖ్యాబలంలో పెద్దదిగా (197) నిలిచినా, సగం సీట్ల సరిహద్దుకు చాలా
దూరంలో ఆగిపోయింది. దానికితోడు కాంగ్రెస్‌తో జత కట్టడానికి ఏ ఒక్క పార్టీ కూడా
సంసిద్ధత చూపలేదు. తరువాతి పెద్దపార్టీ జనతాదళ్‌కు 143 సీట్లు రావడంతో ఆ పార్టీ
ప్రభుత్వం నడపడానికి ఇటు జాతీయభావాలున్న భారతీయ జనతా పార్టీ (85), అటు వామపక్ష
భావాలున్న కమ్యూనిస్టు పార్టీల (33+) మద్దతు అవసరమైంది. ఆ రెండు పార్టీలూ దానికి
అంగీకరించడంతో 1989 డిసెంబర్ 2న వీపీ సింగ్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసాడు.
వీపీ
సింగ్ రాజీవ్‌గాంధీ హయాంలో విత్తమంత్రిగాను, రక్షణ మంత్రిగానూ పనిచేసిన రోజుల్లో
పరిశుద్ధుడిగా కీర్తి పొందిన రాజీవ్ కంటే కూడా పరిశుద్ధుడిగా పేరు తెచ్చుకొన్నాడు.
ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ధీరూభాయ్ అంబానీ ఇంటిపైన, ఒక అమెరికన్ ఏజెన్సీ అయిన
ఫెయిర్‌ఫాక్స్ పైన సీఐడీ దాడులు చేయించాడు. రక్షణమంత్రిగా ఉన్నప్పడు HDW సబ్మెరీన్
ఒప్పందంపైన చర్యకు పట్టుపట్టాడు. అంతేకాదు, బోఫోర్స్ కుంభకోణం విషయమై పార్లమెంటులో
పెనుదుమారాన్ని లేవనెత్తాడు కూడా. ఆపైన కాంగ్రెస్‌కు 1987లో రాజీనామా చేసి, ఆ
తరువాత ‘జనతాదళ్’ పార్టీని స్థాపించాడు.
అయితే
వీపీ సింగ్ తన పదవిలో కనీసం ఒక సంవత్సరం కూడా కొనసాగలేకపోయాడు. దానికి
ముఖ్యకారణాలలో ఒకటి – అప్పటికే అమలులో ఉన్న షెడ్యూల్డు కులాలు, తెగలకు కేటాయించిన
22శాతం రిజర్వేషన్లకే కాక ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీలు) కూడా 27శాతం
రిజర్వేషన్లను సిఫారసు చేసిన మండల్ కమిషన్ నివేదికను తు.చ. తప్పకుండా పాటించే
ప్రయత్నం చేయడం. దానిపైన నిరసనలు, మెచ్చికోళ్ళూ కూడా సమంగానే వచ్చాయి.
ఆ
విషయమై ఆయన పునరాలోచన చేస్తుండగానే 1990 నవంబర్‌లో ఆయన ప్రభుత్వానికి మరొక ఉపద్రవం
వాటిల్లింది. 1990 అక్టోబర్‌లో అప్పటి బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ పార్టీకే చెందిన
లాలూప్రసాద్ యాదవ్, లాల్‌కృష్ణ ఆఢ్వాణీని అరెస్టు చేయించడంతో ఆయన రథయాత్ర అర్ధంతరంగా
ఆగిపోయింది. దానికి నిరసనలు వెల్లువెత్తుతున్నా వీపీ సింగ్, లాలూయాదవ్ చేసిన
దానికి ఏవిధమైన చర్యనూ తీసుకోలేదు. అదే సమయంలో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయంసింగ్
యాదవ్, విశ్వహిందూపరిషత్ వారి కరసేవను అడ్డుకోడానికి ఎంతగానో ప్రయత్నించాడు. అయినా
కొందరు కరసేవకులు 1990 నవంబర్ 2న వివాదాస్పద కట్టడం దగ్గరకు రహస్యంగా చేరుకుని,
దాన్ని కొంతమేరకు పాడుచేయగలిగారు. దానితో పోలీసులు కాల్పులకు పాల్పడ్డారు. ఆ
మొత్తం వ్యవహారం వీపీ సింగ్ పదవికే ఎసరు పెట్టింది. ఎందుకంటే, ఆఢ్వాణీ అరెస్టుకు
నిరసనగా, అప్పటివరకూ వీపీ సింగ్ ప్రభుత్వాన్ని సమర్థించిన భారతీయ జనతా పార్టీ
నాయకుడు వాజపాయి తమ మద్దతును ఉపసంహరించుకోగా వీపీ సింగ్ 1990 నవంబర్ 10న రాజీనామా
చేయవలసి వచ్చింది.
గుర్తుపెట్టుకోవలసిన
మరొక ముఖ్యాంశం ఏంటంటే – వీపీ సింగ్ మంత్రివర్గంలో ముఫ్తీ మహమ్మద్ సయీద్ హోంశాఖ
మంత్రిగా ఉండేవాడు. ఆ కాలంలోనే కశ్మీర్‌లోని ఉగ్రవాదులు అక్కడి పండిట్లను బలవంతంగా
ఖాళీ చేయించడం అనే ప్రక్రియ మొదలైంది. కొన్నేళ్ళ క్రితం వరకూ అది నిరంతరాయంగా
కొనసాగుతూ వచ్చింది. (ఈ పండిట్లకు కశ్మీరులో పునరావాసం కల్పించే ప్రక్రియ 2019లో
మోదీ హయాంలో 370వ అధికరణాన్ని రద్దు చేసాకనే ప్రారంభమైంది.
వీపీ సింగ్
పాలనలో వెనుకబడిన తరగతులకు చెందిన పౌరులు సంఘటితం కావడం మొదలైంది. అప్పటినుండి ఆ
వర్గం భారత రాజకీయాల్లో ప్రబల శక్తిగా అవతరించిందన్నది చారిత్రక వాస్తవం.
*****************************************
చంద్రశేఖర్
(25-06-1931 : 27-11-2008)
*****************************************
అదే
సమయంలో జనతాదళ్ పార్టీలోనే ఉన్న చంద్రశేఖర్ 64మంది ఎంపీలతో ‘సమాజ్‌వాదీ జనతా
పార్టీ’ ఏర్పాటు చేసి 197మంది సభ్యులున్న కాంగ్రెస్ ‘బైటనుంచి ఇచ్చిన మద్దతుతో’
అదే 1990 నవంబర్ 10న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచి, కొంతకాలం నడిపించగలిగాడు.
‘అనుకున్నట్లుగానే’
ఆ ప్రభుత్వం కూడా గట్టిగా బతికి బట్ట కట్టలేకపోయింది. ‘రాజీవ్గాంధీపైన ఏదో గూఢచర్యం
జరుగుతోందనే’ సాకుతో కాంగ్రెస్ 1991 మార్చిలో మద్దతు ఉపసంహరించుకుంది. దానితో
చంద్రశేఖర్ గద్దె దిగిపోవలసి వచ్చింది. ఎన్నికల అవసరం మళ్ళీ ఏర్పడింది. ఆయన 1991
జూన్ 21 వరకూ (కాంగ్రెస్ తిరిగి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచేవరకూ) ఆపద్ధర్మ
ప్రధానిగా కొనసాగాడు.
దాదాపు
అదే సమయంలో భారతదేశపు ఆర్థిక పరిస్థితి దయనీయంగా పరిణమించింది. 400 మిలియన్ డాలర్ల
అప్పు కోసం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ దగ్గర మన 47 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టవలసి
వచ్చింది.
10వ
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
మొత్తం సీట్లు 529 | కాంగ్రెస్ 244 | బీజేపీ 120 | జనతాదళ్ 059 | సిపిఐ(ఎం) 035 | ఇతరులు 071 |
ఈసారీ ఏ
పార్టీకీ సగం సీట్ల ఆధిక్యం కూడా రాలేదు. అయితే పీవీ నరసింహారావు ‘అక్కడక్కడా
అప్పుడప్పుడూ ఇతర పార్టీల తాత్కాలిక సహకారంతో ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని’ ఏర్పరచి ఆ
ప్రభుత్వాన్ని పూర్తిగా ఐదేళ్ళూ నడపగలిగారు.
(పీవీ
నరసింహారావు పరిపాలనాకాలంలోని ముఖ్యాంశాలు, ముఖ్య సంఘటనలూ తరువాతి భాగంలో చూద్దాం)