కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో కృష్ణగిరి, వెల్దుర్తి, పత్తికొండ, మడికెర, తుగ్గలి మండలాలున్నాయి.పత్తికొండ నియోజకవర్గంలో 206538 మంది ఓటర్లున్నారు. పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ ఈ నియోజకవర్గంలో రైతులు, కూలీల సంఖ్య చాలా ఎక్కువ. కరవు,తాగు,సాగు నీటి సమస్యలు పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రాలు.
పత్తికొండ నియోజకవర్గంలో 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీనారాయణ రెడ్డి, కాంగ్రెస్ నుంచి హనుమంత రెడ్డి, 1957లో స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీనారాయణ రెడ్డి రెండోసారి విజయం సాధించారు. 1962లో స్వతంత్ర అభ్యర్థి నర్శిరెడ్డి, 1972లో కాంగ్రెస్ నుంచి కేబీ నరసప్ప, 1978లో సోమందేపల్లి నారాయణ రెడ్డి, 1983లో ఎం తమ్మారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు.
1985లో టీడీపీ నుంచి కుప్పా మహాబలేశ్వరగుప్త, 1989లో పాటిల్ శేషిరెడ్డి కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 1994, 1999, 2004లో టీడీపీ అభ్యర్థిగా సోముల వెంకట సుబ్బారెడ్డి గెలుపొందారు. 2009లో టీడీపీ నుంచి కేఈ ప్రభాకర్ విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి కేఈ కృష్ణమూర్తి, 2019లో వైసీపీ నుంచి కంగటి శ్రీదేవి గెలుపొందారు.
2024 మే 13న జరగనున్న పత్తికొండ అసెంబ్లీ బరిలో వైసీపీ నుంచి కంగటి శ్రీదేవి, టీడీపీ నుంచి కేఈ శ్యామ్ కుమార్, సీపీఐ నుంచి పి.రామచంద్రయ్య బరిలో నిలిచారు.