కర్నూలు లోక్సభ స్థానం 1952లో ఏర్పాటైంది. కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్సభ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ 15 లక్షలకుపైగా ఓట్లుండగా బీసీల సామాజికవర్గాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
కర్నూలులో 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి వై.గడిలింగన్న గౌడ్ విజయం సాధించారు. 1957లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉస్మాన్ అలీ ఖాన్, 1962లో యశోధా రెడ్డి, 1967లో వై.తడిలింగన్న గౌడ్ విజయం సాధించారు. 1971లో కాంగ్రెస్ నుంచి కె.కోదండరామిరెడ్డి, 1977, 1980లో కాంగ్రెస్ ఐ నుంచి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వరుసగా రెండు సార్లు గెలిచారు.
1984లో టీడీపీ అభ్యర్థి ఈ. అయ్యపు రెడ్డి, 1989, 1991లో కాంగ్రెస్ నుంచి విజయభాస్కర్ రెడ్డి, 1991లో కాంగ్రెస్ నుంచి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, 1996, 1998లో కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విజయం సాధించారు. 1999లో టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి, 2004, 2009లో కాంగ్రెస్ నుంచి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక, 2019లో వైసీపీ అభ్యర్థి సంజీవ్ కుమార్ విజయకేతనం ఎగరవేశారు.
20024 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్సభకు వైసీపీ నుంచి బీవై రామయ్య, టీడీపీ నుంచి పంచలింగాల నాగరాజు, కాంగ్రెస్ అభ్యర్థి పీజీ రామపుల్లయ్య యాదవ్ పోటీ పడుతున్నారు. బీసీల ఆశీస్సులు ఎవరికి ఎక్కువగా లభిస్తే వారే ఇక్కడ విజేతలనే అభిప్రాయముంది.