PM Modi offers prayers to Ram Lalla at Ayodhya during
election season
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం అయోధ్యలో
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. దానికి ముందు ఆయన బాలరాముణ్ణి
దర్శించుకుని పూజలు చేసారు.
తొలుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
బాలరాముడికి పూజలు చేసారు. మరికాసేపటికి ప్రధాని మోదీ నూతనంగా నిర్మించిన
రామమందిరానికి వెళ్ళారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మోదీ బాలరాముణ్ణి
దర్శించుకోవడం ఇదే మొదటిసారి.
ఆలయ దర్శనం, ప్రత్యేక పూజల తర్వాత నరేంద్రమోదీ
అయోధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. సుగ్రీవ కోట దగ్గర రామ్‌పథ్ నుంచి మొదలైన
రోడ్ షో లతా చౌక్ వరకూ కొనసాగింది. ఆ రోడ్ షోలో లక్షల సంఖ్యలో ప్రజలు
పాల్గొన్నారు.
గత ఐదు నెలల వ్యవధిలో అయోధ్యలో మోదీ రోడ్ షో
నిర్వహించడం ఇది రెండవసారి. గతేడాది డిసెంబర్ 30న అయోధ్యలోని మహర్షి వాల్మీకి
అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత
మళ్ళీ నిన్న మే 5న రోడ్ షోలో పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి.
ఆ రాష్ట్రంలో పోలింగ్ మొత్తం ఏడు దశల్లోనూ జరుగుతుంది. మొదటి రెండు దశల్లో 16
స్థానాలకు పోలింగ్ జరిగింది. అయోధ్యలో బీజేపీ అభ్యర్ధిగా లల్లూసింగ్ బరిలో
ఉన్నారు. అక్కడ మే 20న అంటే ఐదవ దశలో పోలింగ్ జరుగుతుంది.