సింహపురి
రాజకీయాల్లో ఈ దఫా పలు చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకున్నాయి. మిత్రులే ప్రత్యర్థులుగా
తలపడటంతో పాటు దశబ్దాలుగా నెల్లూరు రాజకీయాలను శాసించిన నేతలు 2024లో లిట్మస్
టెస్ట్ ను ఎదుర్కొంటున్నారు. గెలుపుతో తమ రాజకీయ జీవితానికి విశ్రాంతి ప్రకటించాలని
కొందరు, ఈ దఫా గెలవకపోతే పొలిటికల్ లైఫ్ క్లోజ్ అవుతుందనే ఉద్దేశంతో మరికొందరు నేతలు బరిలో నిలిచారు.
నెల్లూరు
లోక్ సభ స్థానం కోసం ఇద్దరు రాజ్యసభ సభ్యులు పోటీపడుతుండటం మరో విశేషం. కాకపోతే ఈ ఇద్దరూ
వైసీపీ నుంచే పెద్దలసభకు నామినేట్ అయినవారే.
వైసీపీ
పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి వ్యక్తి విజయ
సాయి రెడ్డి అయితే రెండో వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు లోక్ సభ
ఒకప్పుడు కాంగ్రెస్ కి కంచుకోటగా ఉండేది. తర్వాతకాలంలో వైసీపీ కి అడ్డా గా మారింది.
తెలుగు దేశం పార్టీని స్థాపన తర్వాత ఇక్కడ ఆపార్టీ రెండు మార్లు మాత్రమే విజయం
సాధించింది.2024
పార్లమెంటు ఎన్నికల్లో సింహపురి ప్రజలు ఏ నెల్లూరు పెద్దారెడ్డికి పట్టం కడతారో
తెలుసుకోవాలంటూ జూన్ 4 వరకు ఆగాల్సిందే.
వైసీపీ
నుంచి విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తొలిసారి ప్రత్యక్ష
ఎన్నికల్లో పాల్గొంటున్నారు. వైసీపీ తో విభేదాల కారణంగా ఇటీవలే పార్టీ మారిన
వేమిరెడ్డికి టీడీపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది.
సంపన్నుడు,
సేవాకార్యక్రమాలు విరివిగా చేసే వేమిరెడ్డిని లోక్ సభ బరిలోకి దించడంతో పాటు ఆయన
భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు అసెంబ్లీ టికెట్ కేటాయించింది. దీంతో అప్రమత్తమైన
వైసీపీ తీవ్ర మేథోమథనం అనంతరం ఆ పార్టీ
రాజ్యసభ సభ్యుడు విజయసాయిని పోటీలోకి దింపింది.
విజయసాయి
పూర్వీకులది నెల్లూరు అయినప్పటికీ ఆయన గత ఐదేళ్ళుగా విశాఖలో రాజకీయాలు నెరిపారు. కాకపోతే
నెల్లూరు లో వైసీపీకి బలమైన కేడర్ ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశం.
వైఎస్
జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన విజయసాయికి ఆ పార్టీ టికెట్ కేటాయించడంతో సింహపురి
రాజకీయాలు గతం కంటే మరింత ఆసక్తికరంగా మారాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ
సభ్యుడిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు పరిధిలో చేపట్టారు. అలాగే తన
ఫౌండేషన్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొప్పుల రాజు
బరిలో ఉన్నారు.