నెల్లూరు
గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే , సిట్టింగ్ ఎంపీ పోటీ
పడుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్
ఓటింగ్ కు పాల్పడిన ఆరోపణలపై సస్పెన్షన్ కు గురైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సారి సైకిల్
గుర్తుపై శాసనసభకు పోటీ చేస్తున్నారు. మరో వైపు ఫ్యాన్ గుర్తుపై నెల్లూరు సిట్టింగ్
ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలవడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.
గత
ఎన్నికల్లో సహచరులు గా పోటీ చేసిన ఇద్దరు నేతలు ప్రస్తుతం ప్రత్యర్థులుగా
తలపడుతున్నారు. ఎవరూ గెలిచినా నాలుగు
నుంచి ఐదువేల ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించగల్గుతారు.
వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా వైసీపీ
ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్ వెంట నడిచిన
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , మంత్రి పదవి దక్కకపోవడంపై నిరాశ చెందారు. ఆ తర్వాత
నుంచి వైసీపీ కోర్ కమిటీ నిర్ణయాలపై అదును దొరికినప్పుడల్లా అసంతృప్తి, అసహనం
వ్యక్తం చేశారు. వైసీపీ పెద్దల తీరుపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలూ
అనేకం. ఆఖరుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనూరాధకు ఓటు వేసేరానే ఆరోపణలతో
ఆయనపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది.
కోటంరెడ్డి
ఆలోచనను ముందే గ్రహించిన వైసీపీ, రూరల్ ఇంచార్జిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని
నియమించింది. ఎంపీగా గెలిచి ఉండటానికి తోడు రెడ్డి సామాజికవర్గ అండదండలు పుష్కలంగా
ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ గెలుపు కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు
వెళుతున్నారు.
కోటంరెడ్డికి
నియోజకవర్గం వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉండటంతో పాటు ప్రజలకు నిత్యం అందుబాటులో
ఉంటారు. గత రెండు దఫాలుగా ప్రత్యర్థుల కంటే అతి తక్కువగా ఎన్నికల ఖర్చు చేసి గెలుపొందుతున్నారంటే
క్షేత్ర స్థాయిలో ఆయనకు ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు.
2014
లో బీజేపీ అభ్యర్థి సన్నపురెడ్డి సురేశ్ రెడ్డిపై 25,653 ఓట్ల మెజారిటీ సాధించిన
శ్రీధర్ రెడ్డి, 2019లో టీడీపీ అభ్యర్థి షేక్ అబ్దుల్ అజీజ్ పై 22, 776 ఓట్ల
మెజారిటీ సాధించారు.
సంకీర్ణ
ధర్మంలో భాగంగా కోటంరెడ్డికి జనసేన, బీజేపీ నుంచి ఆశించినంత మద్దతు లభించడంలేదని
నియోజకవర్గంలో కొందరు అభిప్రాయపడుతున్నారు. జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు
మనుక్రాంత్ రెడ్డి, గత ఎన్నికల్లో పోటీ చేసి 9 వేల ఓట్లు సాధించారు. ప్రస్తుతం ఆయన
జనసేన వీడి వైసీపీ కి మద్దతు ప్రకటించారు.
మరో వైపు బీజేపీ నుంచి కూడా ఆశించినంత సహకారం దక్కడం లేదని కోటంరెడ్డి
అభిమానులు చెబుతున్నారు. నెల్లూరు గ్రామీణ మండలంలోని చిన్నచేకూరు గ్రామానికి
చెందిన సన్నపురెడ్డి సురేశ్ రెడ్డి,
2014లో కమలం గుర్తుపై పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.
కాంట్రాక్టర్ నుంచి రాజకీయ నేతగా మారిన ఆదాల
ప్రభాకర్ రెడ్డి సొంత నియోజకవర్గం కావలి అయినప్పటికీ
సింహపురిలోని పలు స్థానాల నుంచి పోటీ విజయం సాధించిన చరిత్ర ఆయన సొంతం.
ఐదుసార్లు ఎన్నికల్లో విజయంసాధించిన ఆదాల ప్రభాకర రెడ్డి, 2014లో మాత్రమే
ఓడారు. 1999, 2009లో సైకిల్ గుర్తుపై 2004,
2009 తో హస్తం గుర్తుపై పోటీ చేసి నెగ్గిన ఆదాల 2019లో వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా విజయం సాధించారు. ప్రత్యర్థి బీద మస్తాన్ రావుపై సుమారు లక్షన్నర ఓట్ల
మెజారిటీ సాధించారు.