నారాయణ
విద్యాసంస్థల పేరిట తెలుగు ప్రజలకు సుపరిచితులైన పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ
అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి పోటీకి దిగారు. గత ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై పోటీ
చేసి ఓడిన నారాయణ ఈ సారి కూడా అక్కడి నుంచి బరిలో ఉన్నారు.
గత
ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ ఈ దఫా నర్సరావుపేట
పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. దీంతో వైసీపీ టికెట్
ఎండీ ఖలీల్ అహ్మద్ కు కేటాయించింది.
2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్, పి.
నారాయణపై సుమారు 3 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జనసేన నుంచి పోటీ చేసిన
కేతంరెడ్డి వినోద్ రెడ్డికి 8 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. ఈ సారి జనసేన, టీడీపీ,
వైసీపీ జట్టుకట్టడం నారాయణకు కలిసి వచ్చే అవకాశముంది. 2014 ఎన్నికల్లోనూ అనిల్,
టీడీపీ అభ్యర్థి శ్రీధర్ కృష్ణారెడ్డిపై 19 వేల ఓట్ల మెజారిటీ సాధించారు.
2009లో
కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అనిల్, పీఆర్పీ తరఫున పోటీ చేసిన శ్రీధర్ కృష్ణారెడ్డి
చేతిలో ఓడారు. ఈ ఎన్నికల్లో టీడీపీ మూడో స్థానంలో నిలిచింది. 2004, 1999లో
నెల్లూరు సిటీలో పోటీ చేసిన బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. 1994 తర్వాత టీడీపీ
శ్రేణులు, నెల్లూరు సిటీ లో విజయసంబరాలు చేసుకోలేదు.
2014లో శాసనమండలికి నామినేట్
అయిన నారాయణ చంద్రబాబు మంత్రివర్గంలో మున్సిపల్ మంత్రిగా పనిచేశారు. నెల్లూరు సిటీ స్థానం టికెట్ విషయంలోనే వైసీపీ
పెద్దలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విభేదాలు తలెత్తాయనే వార్తలు చక్కర్లు
కొట్టాయి. అనిల్ తప్పించి ఆ స్థానాన్ని తన భార్య ప్రశాంతిరెడ్డికి ఇవ్వాలని
వేమిరెడ్డి కోరినట్లు వార్తలొచ్చాయి. కానీ నెల్లూరు సిటీ టికెట్ ను అనిల్
అనుచరుడైన ఖలీల్ అహ్మద్ కు ఇవ్వడంతో మనస్తాపం
చెందిన వేమిరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారనేది స్థానిక నేతల విశ్లేషణ.
తమ అభ్యర్థికి ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడటంతో పాటు
నవరత్నాల పథకాల ప్రభావంతో దిగువ మధ్య తరగతి నుంచి మంచి మద్దతు ఉందని, వైసీపీ గెలుపు నల్లేరుమీద నడకేనని ఆ పార్టీ
నేతలు చెబుతున్నారు.