తెలుగురాష్ట్రాల్లో రాజకీయాలపై అవగాహన
ఉన్న ప్రతీఒక్కరికీ ఆత్మకూరులో ఓటరు నాడి
తెలుసుకోవాలనే కుతుహాలం ఉంటుంది. ఎందుకంటే ఈ సారి ఆత్మకూరు అసెంబ్లీ స్థానం నుంచి ఇద్దరు
నెల్లూరు పెద్దారెడ్లు పోటీలో ఉన్నారు. ఇద్దరు రాజకీయ నేపథ్యమున్నకుటుంబాలకు
చెందిన వారే. మేకపాటి కుటుంబం నుంచి విక్రమ్ రెడ్డి, ఆనం కుటుంబం నుంచి మాజీ
మంత్రి రామనారాయణరెడ్డి ప్రత్యర్థులు బరిలో ఉన్నారు.
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
మరణంతో మేకపాటి విక్రమ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో
గెలిచారు. దీంతో మరోసారి ఆయనకే వైసీపీ టికెట్ కేటాయించింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
సైకిల్ గుర్తుపై పోటీలో ఉన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గానికి ఎంతో
చారిత్రక నేపథ్యముంది. శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన ఆత్మకూరు, అనంతసాగరం, మహిమలూరు, అనుమసముద్రం చెరువులతో ఆయకట్టు పెరిగి వ్యవసాయ ఆధారిత
ప్రాంతంగా మారింది. ఆంగ్లేయుల కాలంలో డివిజన్ కేంద్రంగా వర్ధిల్లింది.
నియోజకవర్గంలో ఇప్పటి వరకు డాక్టర్
బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి మూడు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించగా, ఆనం సంజీవరెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మేకపాటి
గౌతమ్‌రెడ్డి రెండు దఫాలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. గౌతమ్ రెడ్డి వైఎస్
జగన్ కేబినెట్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన గుండెపోటుతో చనిపోవడంతో
గౌతమ్ సోదరుడు విక్రమ్ ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.
ప్రస్తుత ఎన్నికల్లోటీడీపీ నుంచి పోటీలో
నిలిచిన ఆనం రామనారాయణ రెడ్డి నాలుగు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో
వైసీపీ తరపున వెంకటగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఆ పార్టీ
అధిష్టానంతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు
వేశారంటూ వైసీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 2009లో ఇదే స్థానం నుంచి
రామనారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడుపై విజయం సాధించారు.