కావలి అసెంబ్లీ స్థానంలో ఈ సారి ట్రయాంగిల్ ఫైట్ జరుగుతోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీలోఉండగా టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ బరిలో ఉన్నారు.
వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ దఫా ఎలాగైనా గెలవాలని టీడీపీ తాపత్రాయపడుతోంది.
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సొంత బలానికి తోడు వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఎంపీగా విజయసాయి రెడ్డి పోటీలో ఉండటం రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూడా నెల్లూరు జిల్లా నేత కావడం ఆ పార్టీకి అదనపు బలాలుగా మారాయి. టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరడం, ఎఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డితో విభేదాలు సమసి పోవడంతో రామిరెడ్డికి కలిసి వచ్చే అంశమని నియోజకవర్గ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.
విజయం ఖాయమని వైసీపీ దీమాగా ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గట్టి సవాలే విసురుతున్నారు. ఆర్థిక అంగబలాలు మెండుగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి, ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని చెబుతున్నారు.
వ్యాపార వేత్త సుధాకర్ ఈ సారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు సవాల్ విసురుతున్నారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసి పదివేల ఓట్లు తెచ్చుకున్న సుధాకర్, టిడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో ఆయన స్వతంత్రంగా బరిలో దిగారు.
సుధాకర్ చీల్చే ఓట్లు ఎవరి విజయానికి గండికొడతాయనేది కీలకంగా మారింది.
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి పై 14 వేల ఓట్ల మెజారీటీ సాధించారు. జనసేన నుంచి పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ కు పదివేల ఓట్లు పడగా బీజేపీ అభ్యర్థి కందుకూరి సత్యనారాయణకు సుమారు రెండున్నర వేల ఓట్లు పోల్ అయ్యాయి.
2014లో టీడీపీ నుంచి పోటీ చేసి నాలుగువేల ఓట్ల తేడాతో ఓడిన బీద మస్తాన్ రావు ప్రస్తుతం వైసీపీ లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.