నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని
కందుకూరు శాసనసభ నియోజకవర్గంలో లింగసముద్రం, వలేటివారిపాలెం, కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు మండలాలు ఉన్నాయి.
వైసీపీ నుంచి యాదవ సామాజికవర్గానికి
చెందిన బుర్రా మధుసూదన్ యాదవ్ బరిలో నిలవగా టీడీపీ నుంచి కమ్మ సామాజికవర్గానికి
చెందిన ఇంటూరి నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు.
మధుసూదన్ యాదవ్ రాజకీయాల్లోకి రాకముందు
బెంగళూరులో బిల్డర్ గా ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి కనిగిరిలో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో పరాజయం
చెందారు. తర్వాత 2019లో అక్కడి నుంచే గెలిచారు. ఆ తర్వాత
టీటీడీ పాలక మండలి సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ లో బిల్డర్ గా ఉన్న
నాగేశ్వరరావు కందుకూరు నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి అదృష్టాన్ని
పరీక్షించుకుంటున్నారు.
టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ
నియోజకవర్గంలో రెండు మార్లే విజయం సాధించింది. 1994లో దివి శివరామ్ టీడీపీ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు. ఆ
ఎన్నికల్లో మాగుంట మహేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో
నిలిచారు. 1999లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. కాకపోతే
మహేందర్ రెడ్డి ఈ సారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత కందుకూరులో
మళ్ళీ టీడీపీ జెండా ఎగురలేదు.
2004, 2009లో టీడీపీ
అభ్యర్థి శివరామ్ ను కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాగుంట ఓడించారు. 2014లో పోతులు రామారావు వైసీపీ నుంచి గెలవగా, టీడీపీ అభ్యర్థి దివి శివరామ్ రెండో స్థానంలో నిలిచారు. ఇక 2019లో మాత్రం మళ్ళీ
మాగుంట బరిలో దిగారు. ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి ప్రత్యర్థి పోతుల
రామారావు(టీడీపీ)ని ఓడించారు. 2019లో జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థి
కేవలం 2,300 పై చిలుకు ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ దఫా వైసీపీ అధిష్టానం మాగుంట బదులు కనిగిరి
ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కి టికెట్ కేటాయించింది. దీంతో టీడీపీ కొత్త
అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇంటూరి నాగేశ్వరరావు సైకిల్ గుర్తుపై తొలిసారి
ఎన్నికల సమరంలో దిగారు.