ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. తాళ్లూరు, కురిచేడు, ముండ్లమూరు, దర్శి, డోర్నకల్ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ మొత్తం 214233 మంది ఓటర్లున్నారు. అన్ని పార్టీల అభ్యర్ధులను దర్శి ప్రజలు ఆదరించారు.పలు పార్టీల అభ్యర్థులు ఇక్కడ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
1952లో సీపీఐ నుంచి శెనికొమ్ము కాశిరెడ్డి, 1955, 1962లో కాంగ్రెస్ అభ్యర్థిగా దరిశాల వెంకట రమణారెడ్డి, 1967లో స్వతంత్ర అభ్యర్థి మహానంద రావిపాటి విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్ నుంచి దరిశెల రాజగోపాల్రెడ్డి, 1978లో కాంగ్రెస్ అభ్యర్థి బెర్రీ ప్రకాశం, 1983లో టీడీపీ నుంచి కాటూరి నారాయణ స్వామి, 1985లో టీడీపీ అభ్యర్థి నారపుశెట్టి శ్రీరాములు గెలుపొందారు.
1989లో కాంగ్రెస్ నుంచి శెనికొమ్ము పిచ్చి రెడ్డి, 1994లో టీడీపీ అభ్యర్థి నారపుశెట్టి శ్రీరాములు, 1997లో టీడీపీ నుంచి నారపుశెట్టి పాపారావు గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా శెనికొమ్ము పిచ్చిరెడ్డి, 2004లో స్వతంత్ర అభ్యర్థి బూచేపల్లి సుబ్బారెడ్డి, 2009లో కాంగ్రెస్ నుంచి బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి, 2014లో టీడీపీ అభ్యర్థి
శిద్ధా రాఘవరావు గెలుపొందారు. శిద్దా రాఘవరావు మంత్రిగా సేవలందించారు. 2019లో వైసీపీ అభ్యర్థి మేడిశెట్టి వేణుగోపాల్ విజయం సాధించారు.
ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, కాంగ్రెస్ నుంచి పొట్లూరి కొండారెడ్డి పోటీలో నిలిచారు. ఇక్కడ వైసీపీ బలంగా ఉన్నా, అసమ్మతి సెగ, టీడీపీ అభ్యర్థికి లాభించే అవకాశముంది.