ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. ఒంగోలు, కొత్తపట్నం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతం ఈ నియోజకవర్గ ప్రత్యేకత. ఇక్కడ 229317 ఓటర్లున్నారు. ఇక్కడ వైసీపీకి బాగా పట్టున్నా టీడీపీ కూడా పలు సందర్భాల్లో సత్తా చాటుకుంది.
ఒంగోలు నుంచి 1952లో సీపీఐ అభ్యర్థి కాసుకుర్తి మాలకొండయ్య, 1955లో కాంగ్రెస్ నుంచి టంగుటూరి ప్రకాశం పంతులు, 1957లో స్వతంత్ర అభ్యర్థి బొల్లినేని వెంకట లక్ష్మీనారాయణ, 1967లో కాంగ్రెస్ నుంచి సీఆర్ రెడ్డి, 1972లో కాంగ్రెస్ అభ్యర్థి శృంగారపు జీవరత్నం నాయుడు గెలుపొందారు. 1983,1985లో టీడీపీ నుంచి పొంగుపాటి కోటేశ్వరరావు, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి బచ్చల బాలయ్య విజయం సాధించారు.
1994లో టీడీపీ నుంచి ఈదర హరిబాబు, 1999, 2004, 2009లో కాంగ్రెస్ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి హ్యాట్రిక్ కొట్టారు.2012 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి బాలినేని విజయం అందుకున్నారు. 2014లో టీడీపీ నుంచి దామచర్ల జనార్థన్, 2019లో వైసీపీ నుంచి బాలినేని గెలిచారు.
ప్రస్తుతం జరుగుతున్న పోరులో ఒంగోలు బరిలో వైసీపీ నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన మిత్రుడు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన రావు, కాంగ్రెస్ నుంచి తురకపల్లి నాగలక్ష్మి పోటీలో నిలిచారు.మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులుగారులాంటి ఉద్దండులను అసెంబ్లీకి పంపిన ఓటర్లు వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఆశీర్వదిస్తారోమరి.