కొండపి నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. సింగరాయకొండ, కొండపి, టంగుటూరు, జరుగుమిల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. ఇక్కడ 231547 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానం కొండపిలో టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయస్వామి రెండు సార్లు వరుసగా గెలిచి మంచి ఉత్సాహంగా ఉన్నారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ప్రజల్లోకి దూసుకెళుతున్నారు.
కొండపి నియోజకవర్గం ఏర్పడిన తరవాత 1955లో కాంగ్రెస్ నుంచి నల్లమోతు చెంచురమణనాయుడు, 1962, 1967లో కాంగ్రెస్ అభ్యర్థి చాగంటి రోశయ్య నాయుడు, 1972లో సీపీఐ నుంచి దివి శంకరయ్య విజయం సాధించారు. 1978లో కాంగ్రెస్ అభ్యర్థి గుండపనేని పట్టాభి రామస్వామి, 1983లో టీడీపీ నుంచి మారుబోయిన మాలకొండయ్య గెలిచారు.
1985, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి అచ్యుత్ కుమార్ గుండపనేని, 1994, 1999లో టీడీపీ అభ్యర్థి దామచర్ల ఆంజనేయులు వరుసగా రెండు సార్లు గెలిచారు. 2004లో కాంగ్రెస్ నుంచి పోతుల రామారావు, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్రాల వెంకట శేషు, 2014, 2019లో టీడీపీ నుంచి డోలా బాల వీరాంజనేయస్వామి విజయం సాధించారు. 2024లో గెలిచి హ్యాట్రిక్ కోసం డోలా ప్రయత్నం చేస్తున్నారు.
కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కొండపి వైసీపీ నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్,టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, కాంగ్రెస్ అభ్యర్థి పసుమర్తి సుధాకర్‌రావు బరిలో నిలిచారు. రెండు సార్లు గెలిచిన డోలాకు పెద్దగా అసమ్మతి లేకపోవడం కలసి వచ్చే అంశం కాగా, మంత్రి ఆదిమూలపు సురేష్ స్థానికేతరుడు కావడం ఆ పార్టీకి మైనస్‌గా చెప్పుకోవచ్చు.