ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం 1951లో ఏర్పడింది. కంభం,కొనకణమిట్ల, పొదిలి, మార్కాపురం, తర్లుపాడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మార్కాపురంలో 209753 మంది ఓటర్లున్నారు. రాష్ట్రంలోనే తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న నియోజకవర్గంలో మార్కాపురం చేరింది.మూడు దశాబ్దాల కిందట మొదలుపెట్టిన వెలిగొండ ప్రాజెక్టు నేటికీ పూర్తికాకపోవడంతో ఈ ప్రాంత ప్రజల నీటి కష్టాలు తీరలేదు.
మార్కాపురం నియోజకవర్గంలో 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో క్రిషికార్ లోక్ పార్టీ అభ్యర్థి ఎన్.వెంకటయ్య, 1955లో క్రిషికార్ లోక్ పార్టీ నుంచి కందుల ఓబుల్ రెడ్డి, 1962లో కాంగ్రెస్ నుంచి ఓబుల్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు. 1967లో స్వతంత్ర అభ్యర్ధి సి. వెంగయ్య, 1972లో కాంగ్రెస్ నుంచి ఎం.నాసర్ బేగ్ గెలుపొందారు. 1978లో సీపీఐ నుంచి పూల సుబ్బయ్య,1983లో టీడీపీ నుంచి వీవీ నారాయణరెడ్డి, 1985,1989లో కాంగ్రెస్ నుంచి కుందురు పెద్ద కొండారెడ్డి, 1994లో స్వతంత్ర అభ్యర్థి జంకె వెంకటరెడ్డి విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ నుంచి కుందూరు పెద కొండా రెడ్డి, 2009లో టీడీపీ నుంచి కందుల నారాయణ రెడ్డి, 2014లో వైసీపీ నుంచి జంకె వెంకటరెడ్డి, 2019లో వైసీపీ నుంచి కుందూరు నాగార్జున రెడ్డి గెలుపొందారు.
మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి అన్న వెంకట రాంబాబు, టీడీపీ నుంచి కందుల నారాయణ రెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ వైసీపీకి మంచి పట్టున్నా, ఆ పార్టీలో అసమ్మతి టీడీపీకి కలసి వస్తుందనే అంచనాలున్నాయి.