కనిగిరి నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. హనుమంతునిపాడు, సీఎస్ పురం, పామూరు, వెలిగండ్ల, పీసీపల్లి, కనిగిరి మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. 231881 మంది ఓటర్లున్నారు. కరవుతో సాగునీరులేక వలస నియోజకవర్గంగా కనిగిరికి పేరుబడింది. దాదాపు 60వేల మంది పొరుగు రాష్ట్రాలకు వలసపోయారని అంచనా. వారంతా ఓటింగుకు వస్తారా లేదా అనేది నాయకులను కలవరపెడుతోంది.
కనిగిరిలో మొదటి ఎన్నికలు 1952లో జరిగాయి. 1952, 1957లో సీపీఐ నుంచి గుజ్జల యలమందారెడ్డి, 1962లో సీపీఐ నుంచి కొత్తపాటి గురుస్వామిరెడ్డి విజయం సాధించారు. 1967లో కాంగ్రెస్ నుంచి పులి వెంకటరెడ్డి, 1972లో స్వతంత్ర అభ్యర్థి సురా పాపిరెడ్డి, 1978లో కాంగ్రెస్ అభ్యర్థి బుదులపల్లి రామసుబ్బారెడ్డి గెలుపొందారు. 1983, 1985లో టీడీపీ అభ్యర్థి ముక్కు కాశిరెడ్డి, 1989లో కాంగ్రెస్ నుంచి ఎరిగినేని తిరుపతి నాయుడు, 1994లో టీడీపీ నుంచి ముక్కు కాశిరెడ్డి విజయం సాధించారు.
1999లో కాంగ్రెస్ నుంచి ఎరిగినేని తిరుపతి నాయుడు, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, 2014లో టీడీపీ నుంచి కదిరి బాబూరావు, 2019లో వైసీపీ నుంచి బుర్రా మధు సూధన్ యాదవ్ విజయం అందుకున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి దడ్డాల నారాయణ యాదవ్, టీడీపీ నుంచి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కాంగ్రెస్ నుంచి దేవరపల్లి సుబ్బారెడ్డి బరిలో నిలిచారు. వైసీపీ నుంచి నారాయణ యాదవ్ అంత బలమైన అభ్యర్థి కాకపోవడం టీడీపీకి కలసి వచ్చే అంశం.